పమిడికాల్వ మధుసూదన్ అలియాస్ ధాత్రి మధు. గడచిన 36 గంటలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పేరు. పమిడికాల్వ మధుసూదన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విజయవాడ జిల్లా జైలుకు తరలించడమే ఆయా వర్గాల్లో ఈ చర్చకు ప్రధాన కారణం. ఇంతకీ ధాత్రి మధు అనబడే ఈ పమిడికాల్వ మధుసూదన్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనే అంశం తెలుసుకునే ముందు అసలెవరీ పమిడికాల్వ మధుసూదన్..? అనే విషయంలోకి వెడదాం.
పమిడికాల్వ మధుసూదన్ నిజానికి ఓ సాధారణ విలేకరి. అనంతపూర్ జిల్లా హిందూపూర్ కేంద్రానికి రామ్ నాథ్ గోయెంకాకు చెందిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులోని ఆంధ్రప్రభ (ఇప్పటి ఆంధ్రప్రభ కాదు) పత్రికకు రెగ్యులర్ కంట్రిబ్యూటర్ (ఆర్ సి) గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఆంధ్రభూమి పత్రికలో కొంతకాలం పని చేశాడు. కాలక్రమంలో జెమినీ టీవీకి చెందిన తేజ టీవీలో పనిచేశాడు. వాస్తవానికి మధుసూదన్ చేయి తిరిగిన రాతగాడు. చక్కటి భాషతో ఆకట్టుకునే శైలిలో రాయడం మధుసూదన్ ప్రత్యేకత. ముఖ్యంగా సమాజపు విలువలు, తెలుగు భాష ఖూనీ అవుతున్న తీరు, నైతిక విలువల గురించి అద్భుతమైన నీతిని ఉపదేశిస్తూ రాస్తుంటాడు. అంతేకాదు బ్యాంకు లోన్లలో జరిగే స్కాంల గురించి, ప్రభుత్వాల గుడ్డితనం గురించి, టీచర్ల నైతికత వంటి అనేక అంశాలపై మధనపడుతూ మధుసూదన్ కలం నుంచి జాలువారిన రాతలకు ‘ముచ్చట’ పడిన అనేక మంది ఆయన వ్యాసాలను వాడుకుంటుంటారు కూడా.

తన రాతల్లో ఎక్కువగా సమాజ హితాన్ని, భాషా ఔన్నత్యాన్ని, నైతిక విలువలను కాంక్షించే మధుసూదన్ కాలక్రమేణా వివిధ ప్రభుత్వాల హయాంలో కీలక వ్యక్తిగా ఎదగడం విశేషం. విజయవాడ ఎంపీగా ఉన్నకాలంలో లగడపాటి రాజగోపాల్ వద్ద చేరి కొంతకాలం అక్కడ పనిచేసిన మధు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ప్రసార మాధ్యమాలపరంగా ప్రముఖునిగా మారడం గమనార్హం. దశాబ్ధంన్నరకుపైగా మీడియా వ్యాపారంలో విశేష అనుభవం గడించాడు. వివిధ పత్రికలు, మేగజైన్లు, వెబ్ సైట్లలో కాలమిస్టుగా ప్రాచుర్యం పొందాడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో లభించిన చేయూతతో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్టును దక్కించుకున్నట్లు వార్తలున్నాయి. ఆ తర్వాతే సాధారణ విలేకరి జీవితం నుంచి పమిడికాల్వ మధుసూదన్ స్థాయి ధాత్రి కమ్యునికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ హోదాకు ఎదిగింది. అనంతరం డక్కన్ వీడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ ఫ్రాసైన్ ప్రాజెక్స్ట్, కామ్ సైన్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్ హోదాల్లో కూడా ఉన్నాడు. దాదాపు ఎనిమిది సంస్థలతో మధుసూదన్ అనుబంధాన్నివ్యాపార బంధాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.

ఓ సాధారణ కంట్రిబ్యూటర్ గా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన పమిడికాల్వ మధుసూదన్ ధాత్రి కమ్యునికేషన్స్ సంస్థను ఏర్పాటు చేశాక ధాత్రి మధుగా పేరు గాంచాడు. అయితే క్యామ్ సైన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న పమిడికాల్వ మధుసూదన్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడం వెనుక పెద్ద దోపిడీ కథే ఉండడం ఆసక్తికరం. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం పేరుతో హ్యాయ్ ల్యాండ్ వేదికగా మొక్కుబడి తంతు నిర్వహించి రూ. 1.14 కోట్లు తీసుకున్నాడట. అందులో అక్షరాలా అరవై లక్షల రూపాయలను పమిడికాల్వ మధుసూదన్ దోచుకున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారట. జవాబు పత్రాలను దిద్దడానికి కనీస అర్హతలు లేని వారిని నియమించుకుని మధుసూదన్ ఈ దోపిడీ దందాకు పాల్పడినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో కోర్టుకు నివేదించారట.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాల కేసులో ఏ1గా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును, ఏ2గా ధాత్రి మధును చేర్చారు. అనంతరం హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన మధును విజయవాడకు తరలించి కోర్టులో హాజరు పరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. మొత్తంగా అటు వైఎస్ ప్రభుత్వ హయాంలో, ఇటు జగన్ ప్రభుత్వ కాలంలో తన వ్యాపారం ద్వారా వివిధ వర్గాల్లో ప్రముఖునిగా ఎదిగిన ఓ సాధారణ విలేకరి దోపిడీ కేసులో అడ్డంగా బుక్కయిన తీరు జర్నలిస్టు సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది.