Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

వలువలూడిన జర్నలిజం: కొమ్మినేని అరెస్ట్

సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో తన ఇంటి దగ్గర తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతను మోడరేటర్ గా పని చేసే సాక్షి టీవీలో జరిగిన డిబేట్ లో ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా చెప్పుకునే మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు కలసి అమరావతి రాజధానిని ఉటంకిస్తూ, అభ్యంతర, అసభ్య పదంతో కూడిన రాజధాని అని వ్యాఖ్యానించడంపై దుమారం రేగింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందూలోనో చూశానని కొమ్మినేని శ్రీనివాసరావు (70) వత్తాసు పలకడంపై అమరావతి మహిళలు ధ్వజమెత్తారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ రాయపాటి సుమోటోగా ఈ కేసును స్వీకరించారు. పలు పోలీస్ స్టేషన్లలో అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు.

దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు అభివర్ణించినందుకు ప్రతిగా జరిగిన డిబేట్ లో అది దేవతల రాజధాని కాదంటూ, అభ్యంతరకర పదాన్ని కోట్ చేస్తూ… రాజధాని అని, చుట్టూ వారే ఉన్నారని కృష్ణంరాజు తీవ్ర అనుచిత ఆరోపణలు చేశారు. దేవతల రాజధాని అయితే హిందువుల దేవతలా? ముస్లిం దేవతలా? క్రైస్తవ దేవతలా అని ప్రశ్నించి మతాలను అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్ధిస్తూ అవును, తాను కూడా పత్రికల్లో చూశానని ఇద్దరూ వెటకారంగా మాట్లాడుకోవడం నిజంగా సిగ్గు చేటు.

కనీసం బాధ్యత వహించి ఆ ఇద్దరు జర్నలిస్టులు అమరావతి మహిళలకు క్షమాపణ కూడా చెప్పలేదు. సాక్షి ఛానెల్ మాత్రం ఆ డిబేట్ కు యాజమాన్యంకు సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకుంది. కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి మహిళలకు సారీ చెప్పకుండా యాజమాన్యం భారతి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు సారీ. సారీ చెప్పినా వాళ్ళేం తగ్గరు, వారిని ఆంధ్రజ్యోతి, టీవీ5 రెచ్చగొడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి రావడానికి వీలు లేదని చెప్పడం, బయట కుర్చీ వేసుకుని కూర్చోవడంతో, విచారించి “అరెస్ట్ చేస్తున్నాం” అని చెప్పి తుళ్లూరు తరలించినట్లు సమాచారం. జర్నలిస్ట్ పత్రిక ఎడిటర్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆజ్ఞాతంలో ఉండి ఆయన వీడియో విడుదల చేశారు. తాను నిజాలు చెప్పానని, ఆధారాలు వున్నాయని, చుట్టూ వాళ్లే ఉన్నారని అన్నానే కానీ అమరావతి మహిళలను అనలేదని, తగ్గేదేలా అంటూ ఇంకా రెచ్చిపోయారు.

నిజానికి ఇప్పుడు జర్నలిజానికి విలువలు లేవు.. వలువలు లేవు. యాజమాన్యాలు చేసే వ్యాపారాలకు అండగా నిలవడమే నేటి జర్నలిజం. ఆయా పత్రికలు, ఛానెళ్ళు ఏ రాజకీయ పార్టీకి గొడుగు పడితే దానికి కొమ్ము కాయడం నేటి జర్నలిజం. వాళ్ళకు నచ్చిన వారికి జై కొట్టడం, డప్పు వాయించడమే నేటి జర్నలిజం. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అదే చేశారు. వాళ్ళు వైసీపీ గొడుగు కింద వున్నారు. వాళ్లు వారి పార్టీకి అండగా నిలవడం వారి జర్నలిజం. అయితే, ఎవరి ఎత్తుగడలు వారి ఇష్టం. కానీ హద్దు దాటి మరీ వికృతం ప్రదర్శించారు వీరిద్దరూ. నీచంగా మాట్లాడారు.

అరెస్టు సందర్భంగా తన ఇంటిముందు కొమ్మినేని శ్రీనివాసరావు

యాభై ఏళ్ల పాత్రికేయ అనుభవం వున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఇక పూర్తిగా జర్నలిజం వదిలేస్తే గౌరవంగా ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు “తాను సీనియర్ సిటిజన్ ఎలా అరెస్ట్ చేస్తారు” అని ప్రశ్నించారు. ఆయన ఒప్పుకున్నారు కాబట్టి సీనియర్ సిటిజన్ గా ఇక జర్నలిస్ట్ గా తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. కృష్ణంరాజు పేరుకే జర్నలిస్ట్ కాబట్టి ఆయన్ని ఎవ్వరూ గుర్తించరు. ఆయన కూడా రిటైర్డ్ కాబట్టి, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటారని భావిస్తున్నాను. జర్నలిస్ట్ సంఘాలు కూడా నోరు విప్పకపోవడం, ఖండించక పోవడం విచారకరం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. వాళ్ళేం చేస్తారో చూడాలి!

మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు. బీఎన్ఎస్ చట్టంలోని 79, 196(1), 353(2), 299, 356(2), 61(1) సెక్షన్లతోపాటు, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA Act సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

– డా. మహ్మద్ రఫీ

Popular Articles