ఖమ్మం: జర్మనీ దేశంలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల అవకాశాలను ఖమ్మం జిల్లా ఉపాధి కల్పనాధికారి వెల్లడించారు. ఈ ఉద్యోగాల కోసం ఎలక్ట్రిషియన్ ట్రేడ్ లో ఐటిఐ పూర్తి చేసి, రెండు సంవత్సరాల అనుభవం ఉన్న 19 నుండి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈనెల 30న ఉదయం 10.00 గంటలకు ఖమ్మంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్ లోని మోడల్ కెరీర్ సెంటర్ లో టామ్ కామ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎన్రోల్మెంట్ డ్రైవ్ కు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా ఉపాధికల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం 2.60 లక్షల నుంచి 2.70 లక్షల వరకు అందుతుందని చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నేరుగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కు హాజరు కావాలని ఆయన కోరారు.
డిప్టొమా కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగింపు:
కాగా డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాల వ్యవధి గల కోర్సులలో 30 చొప్పున సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అర్హులైన విద్యార్థులలో మొదటి ప్రాధాన్యత బైపీసీ విద్యార్థులకు ఉంటుందని, తర్వాత ఎంపీసీ, ఇతర విద్యార్థులకు తదుపరి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు ముందుగా https://tspmb.telangana.gov.in/ నందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని అవసరమైన ధృవపత్రాలతో కలిపి నవంబర్ 27 సాయంత్రం ఐదు గంటల లోపు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం https://gmc.khammam.org వైబ్ సైట్ పరిశీలించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

