Top 5 This Week

Related Posts

జగిత్యాలలో ఖమ్మం పొలిటికల్ సీన్ కనిపిస్తోందా!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
‘పవర్’లో ఉన్నపుడు ప్రజల్లో గల ప్రభావిత నాయకుల గురించి పాలక పగ్గాలు చేతిలో గల నాయకులకు తెలియకపోవచ్చు.. తెలిసినా తేలిగ్గా తీసుకోవచ్చు.. ఎందుకంటే ‘పవర్’కు ఉన్నటువంటి శక్తి అటువంటిది. కానీ ‘పవర్’ చేజారాక అలా.. చేయకుండా ఉండాల్సింది.. అని ఆ తర్వాత పశ్చాత్తపపడినా ప్రయోజనం ఉండకపోవచ్చు.. తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా అధికార పీఠంపై కూర్చున్నవారికి తాటిపర్తి జీవన్ రెడ్డి అనే కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడి చరిత్ర పూర్తిగా తెలుసో, లేదోగాని, ఆయన కదలికలను ‘తాటాకు’ చప్పుళ్లుగా అభివర్ణిస్తున్న పెయిడ్ రాతగాళ్ల ముచ్చట్లు మాత్రం పవర్ ను ఎంజాయ్ చేస్తున్న అధికార పార్టీ నేతలకు మహా ఆసక్తికరంగానే ఉండవచ్చు..

విషయంలోకి సూటిగానే వెడదాం.. వెళ్లేముందు సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన తెలంగాణా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, గులాబీ కోటను కూల్చిన ఓ ఇంట్రస్టింగ్ పొలిటికల్ సీన్ గురించి క్లుప్తంగానే గుర్తు చేసుకుందాం. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ తిరుగుబాటు స్టోరీ గుర్తుంది కదా..? ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న మాజీ బీఆర్ఎస్ నాయకుడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి నిత్యం కేటీఆర్ చెవుల నుంచి రక్తం కారేలా నూరిపోసిన గులాబీ పార్టీ నాయకుడొకరు ఇప్పుడు ఎక్కడా ఉన్నారో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియనిదేమీ కాదు. అసలు ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఎంత? ఆయన ఉంటే ఎంత? పోతే ఎంత? అని కేటీఆర్ చెవికి ‘రికాం’ లేకుండా నూరి పోయడంలో అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు సక్సెస్ అయ్యారనేది బహిరంగమే.

తుమ్మల, పొంగులేటి (ఫైల్ ఫొటోలు)

ఆ తర్వాత తుమ్మల నాగేశ్వర్ రావు ప్రభావాన్ని కూడా గులాబీ పార్టీ అధిష్టానం ముందు తక్కువచేసి చూపడంలో అదే పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా నాయకుడొకరు విజయవంతమయ్యారు. తాను తలచుకుంటే అటు పొంగులేటిని, ఇటు తుమ్మలను రాజకీయంగా కనుమరుగు చేయగలననే ధీమాను పార్టీ అధిష్టానం ముందు ఆయన ప్రదర్శించారనే ప్రచారం ఉండనే ఉంది. ఈ చెప్పుడు మాటలను వినడం వల్లే కేటీఆర్ తోపాటు కేసీఆర్ సైతం పొంగులేటిని, తుమ్మల నాగేశ్వర్ రావులను లైట్ తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది.

ఫలితంగానే అనివార్యంగా పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరారు… ఇదే వరుసలో తుమ్మల నాగేశ్వర్ రావు కూడా పయనించారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తదితర నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ ముగ్గురు ముఖ్యనేతల రాజకీయ నిర్ణయం రాష్ట్ర పొలిటికల్ ముఖచిత్రాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేసిందనేది కాదనలేని వాస్తవం. చివరికి ఏం జరిగింది? కసికొద్దీ కాంగ్రెస్ ఎన్నికల్లో పోరాడింది. పొంగులేటి, తుమ్మల, జూపల్లి వంటి నాయకుల రాజకీయ పంతం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. బీఆర్ఎస్ ను అధికార పీఠం నుంచి దించడానికి దోహదపడింది. ఇదీ అప్పటి పొలిటికల్ సీన్ కు సంబంధించిన క్తుప్త సారాంశం.

జీవన్ రెడ్డితో శనివారం సమావేశమైన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు

ఇప్పుడు వర్తమానంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్ధాల అనుబంధం గల జగిత్యాలకు చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ కదలికలు ఇప్పుడు అధికారంలో గల ఆ పార్టీ నాయకులకు పెద్దగా పట్టకపోవచ్చు. ‘భజన’ ముచ్చట్ల రాతలను భలే పసందుగా ఆస్వాదించవచ్చు.. కానీ రాజకీయంగా జీవన్ రెడ్డి తీసుకుంటున్న స్టెప్ ‘తాటాకు చప్పుళ్లు’ ఏమాత్రం కావని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు గుర్తించినట్లున్నారు. అందుకే కాబోలు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు శనివారం విఫలయత్నం చేశారు. ఇద్దరు మంత్రులతోపాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా జీవన్ రెడ్డితో జగిత్యాలలో ఆయన ఇంటికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. కానీ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు.

ఇంతకీ జీవన్ రెడ్డి విషయంలో రాష్ట్ర నాయకులు పట్టింపు లేనివిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? కేటీఆర్ కు, కేసీఆర్ కు పొంగులేటి, తుమ్మల వంటి నాయకుల గురించి నూరిపోసినట్లు, జగిత్యాల రాజకీయాల్లోనూ జరుగుతుండవచ్చు. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు. కానీ నిజాన్ని నిష్కర్షగా చెప్పాలంటే రాజకీయంగా జీవన్ రెడ్డి తాజాగా తీసుకునే నిర్ణయం పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఆయన ప్రభావం కేవలం జగిత్యాలోనే కాదు, ఆ నియోజకవర్గానికి అనుకుని ఉండే గల కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లోనూ తప్పకుండా ఉంటుంది. వయస్సు మీరిన నాయకుడని తేలిగ్గా తీసుకునే నాయకుడు మాత్రం జీవన్ రెడ్డి కాదనేది రాజకీయంగా ఆయన శక్తి, యుక్తులు తెలిసినవారు ఎవరైనా అంగీకరిస్తారు.

మరో రెండున్నరేళ్లపాటు అధికారం ఉంది కదా? అనే భావనలో జీవన్ రెడ్డి వంటి నాయకులను పార్టీ వదులుకుంటే ఆయన బాటలో మరికొందరు నాయకులు పయనిస్తే.. పరిస్థితులు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయనేది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాకపోవచ్చు. జీవన్ రెడ్డి బాగా డబ్బున్న నాయకుడు కాకపోవచ్చు.. కానీ కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డికి ఓ చరిత్ర ఉంది. తెలుగుదేశం ప్రభుత్వాల ప్రభంజనంలోనూ జగిత్యాలలో ఎదురొడ్డి విజయం సాధించిన చరిత్ర జీవన్ రెడ్డిది. పార్టీపట్ల ఆయన అంకితభావాన్ని, చిత్తశుద్దిని తేలిగ్గా తీసుకుంటే అది ఎటువంటి పరిణామాలకు దారి తీసినా అనుభవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జరగాల్సిన నష్టం జరిగాక, పొంగులేటిని, తుమ్మలను వదులుకోవడం తమ తప్పిదంగా వేర్వేరు సందర్భాల్లో గులాబీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పశ్చాత్తాపం చెందిన తరహాలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెత గుర్తుకురాక మానదు. ‘వెలుగుమట్ల’లో పేదల ఇండ్లు కూల్చి నష్ట నివారణ చర్యలకోసం అపసోపాలు పడుతున్న తీరు రాజకీయంగానూ ఎదురైతే మున్ముందు అధికార పార్టీకి మిగిలేదేమీ ఉండకపోవచ్చు. అదీ విషయం.

Popular Articles