సర్వీసు మొత్తంలో ఎంతగా ‘కక్కుర్తి’ పడినప్పటికీ, పదవీ విరమణ చెందే నెలలోనైనా ‘పద్ధతి’గా ఉండాలని అమ్యామ్యాలకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ అధికారులు భావిస్తుంటారు. కొందరైతే దీన్ని అమలు చేస్తుంటారు కూడా. కానీ మరికొందరు అధికారులు మాత్రం పదవీ విరమణకు ‘ఆఖరు’ రోజుల్లోనూ కక్కుర్తి పడి జైలు ఊచలు లెక్కిస్తుంటారు. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) బానోత్ భద్రూనాయక్ పరిస్థితి ఇదే విధంగా మారడం విశేషం. ఈ నెలాఖరున పదవీ విమరణ చేయాల్సి ఉన్నప్పటికీ, బుధవారం లంచం తీసుకుంటూ భద్రూనాయక్ ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెడితే..
కోరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తికి చెందిన జేసీబీని సరైన పత్రాలు లేవనే సాకుతో డీటీవో భద్రూనాయక్ సీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా శశిధర్ ఫోన్ ను కూడా డీటీవో తీసుకున్నారట. ఈ ఘటనలో ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఉండడానికి, అపరాధ రుసుం విధించకుండా ఉండడానికి, తీసుకున్న ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి సైతం రూ. 40 వేల లంచం డిమాండ్ చేయగా, రూ. 35 వేలకు బేరం కుదిరింది. ఇందులో రూ. 13 వేల మొత్తాన్ని ఈనెల 4వ తేదీన బాధితుడు చెల్లించారు. మిగతా రూ. 22 వేల మొత్తంకోసం ఒత్తిడి చేశారు. గత్యంతరం లేక బాధితుడు శశిధర్ ఈ మొత్తాన్ని బుధవారం ఇవ్వడానికి అంగీకరించారు. ఇందులో భాగంగానే డీటీవో భద్రూనాయక్ తన డ్రైవర్ బానోత్ అరవింద్ ద్వారా శశిధర్ నుంచి రూ. 22 వేల నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి డీటీవోపై కేసు నమోదు చేయడంతోపాటు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు.

