కొందరు బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జన హితాన్ని మర్చిపోతున్నారా? శిక్షణలో నేర్చుకున్న అంశాలకు, తాము విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భౌతిక పరిస్థితులకు పొంతన ఉండడం లేదా? లేక ఆత్మాభిమానాన్నికోల్పోతూ రాజకీయ నాయకుల ముందు మోకరిల్లుతున్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తపనతో అడ్డదారి సంపాదనలో నిమగ్నమై పొలిటికల్ లీడర్ల కాళ్లు మొక్కుతున్నారా? ఈ అంశంలో నేరం కేవలం సివిల్స్ అధికారులదేనా? రాజకీయ నాయకులది కూడానా? తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి గురించి నిన్న చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ ఆవేదనలో అర్థం లేకపోలేదు. అందుకు కారణాలూ లేకపోలేదు. అవేమిటో విశ్లేషించుకునేముందు ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెడితే..
1994-95 ప్రాంతంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నక్సలైట్ల ‘రాజ్యం’ నడుస్తున్న రోజులవి.. చేర్యాల మండలం కొమురవెల్లిలో నక్సల్స్ ప్రజాకోర్టులో ఓ వ్యక్తి తప్పిదాలను ఎత్తిచూపుతూ అతన్ని చితకబాదారు. ఈ వార్తను మాత్రమే కవర్ చేయాల్సిన ఓ ప్రముఖ పత్రిక స్థానిక విలేకరి ముచ్చట పడి తన హీరోయిజాన్ని ప్రదర్శించాడనేది పోలీసుల అభియోగం. ఘటన జరిగిన సమయంలో అక్కడే గల విలేకరి నక్సల్స్ తో పాటు తాను ఓ కర్ర తీసుకుని ఆ వ్యక్తిని కొట్టాడనేది పోలీసుల కేసు. ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత ప్రజాకోర్టులో దెబ్బలు తిన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో అది కాస్తా మర్డర్ కేసుగా మారింది. ఆ విలేకరి ఈ హత్య కేసులో నిందితునిగా మారాడు. ‘పోలీసు మర్యాద’ను తలచుకుని బెంబేలెత్తిన విలేకరి అరెస్టు భయంతో అక్కడి నుంచి పారిపోయి జర్నలిస్టు సంఘాల శరణుజొచ్చాడు. దాదాపు రెండు నెలలపాటు హైదరాబాద్ లోని జర్నలిస్టు యూనియన్ ఆఫీసులో సదరు విలేకరి దాక్కోవలసిన స్థితి.

ఈ కేసుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. విలేకరిపై పోలీసులు అక్రమ కేసు పెట్టారని ఆందోళనకు దిగాయి. అప్పటి సీఎం చంద్రబాబు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు హన్మకొండ అదాలత్ వద్దకు వచ్చారు. జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించి కేసు నుంచి విలేకరిని తప్పించాలని సీఎంను కోరారు. పక్కనే ఉన్న అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ సుదీప్ లక్టాకియాను సీఎం పిలిచి కేసు నుంచి విలేకరిని తప్పించాలని పబ్లిక్ గానే ఆదేశించారు. ఇందుకు ఎస్పీ సుదీప్ లక్టాకియా నో చెప్పారు. కేసు నుంచి ఒక్కరిని తప్పించడం కుదరదని, చట్టం అందుకు అంగీకరించదని, మొత్తం కేసే ఎత్తేయాల్సి వస్తుందని, అందువల్ల సాధ్యం కాదని చెప్పారు. చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పినా వినని ఎస్పీ లక్టాకియా అవసరమైతే తనను బదిలీ చేసుకోవచ్చనే తరహాలో వ్యవహరించారు. ఆ తర్వాత లక్టాకియా వరంగల్ నుంచి బదిలీ అయ్యారనేది వేరే విషయం. కానీ సీఎం చెప్పారని ఆ ఎస్పీ చట్టానికి విరుద్దంగా వ్యవహరించేందుకు అంగీకరింలేదన్నదే ఇక్కడ అసలు పాయింట్.
ఇక మరో ఘటనలోకి వెడితే.. 1998లో అధికార టీడీపీ పార్టీకి చెందిన అప్పటి పెద్దపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే బిరుదు రాజమల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హోదాలో గల రూలింగ్ పార్టీ లీడర్ ను అరెస్టు చేసి మంథని పోలీస్ స్టేషన్ లో బంధించిన పరిస్థితులు తీవ్ర రచ్చకు దారి తీశాయి. చొప్పదండిలో సీఎం చంద్రబాబు పర్యటన సాగుతున్న సమయంలోనే అక్కడి మండల పార్టీ నాయకున్ని జీపులో వేసుకుని సమీప గుట్టల్లోకి తీసుకువెళ్లి ఛాతీ ఎముకలు విరిగేలా కొట్టిన ఘటన అప్పటి పోలీసు ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలకు తావు కల్పించింది. ఆ తర్వాత పరిణామాల్లో ఎస్పీ ఉమేష్ చంద్ర బదిలీతో కరీంనగర్ లో పోలీసుల విధ్వంసం, ఆగ్రహించిన సీఎం చంద్రబాబు ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అప్పటి కరీంనగర్ రేంజ్ డీఐజీ వివేక్ దూబే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అప్పట్లో వార్తలు రావడం కూడా గమనార్హం. ఈ అంశంలో అప్పట్లో కరీంనగర్ విధులు నిర్వహించిన ఇద్దరు ఐపీఎస్ అధికారుల అతి ప్రవర్తనకు తార్కాణంగా ఇప్పటికీ భిన్న కథనాలు వినిపిస్తుంటాయి. తమ చేతిలో పవర్ ఉందని విపరీత ధోరణితో అధికారులు ప్రవర్తిస్తే జరిగే పరిణామాలకు ఈ ఘటన ఓ ఉదాహరణ.

ఇప్పుడు మూడో ఉదంతంలోకి వెడితే.. ఏటూరునాగారం దండకారణ్యంలోని మేడారం జంపన్న వాగుపై వంతెన ఏర్పాటును అడ్డుకోవడానికి నక్సలైట్లు ప్రయత్నించిన పరిణామాల్లో 30 రోజుల్లో వంతెనను పూర్తి చేయించిన ప్రభాకర్ రెడ్డి వంటి నిబద్ధత గల ఐఏఎస్ అధికారుల సేవలను ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకున్నారు. ఎక్కడో దారీ, తెన్నూ లేని కన్నాయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పాముకాటు వల్ల ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే నిండు గోదారిలో లాంచీపై ప్రయాణించి అక్కడికి వెళ్లి పరిస్థితులను చక్కదిద్దిన నీరబ్ కుమార్ ప్రసాద్ వంటి ఐఏఎస్ అధికారులు అనేక మంది ఇప్పటికీ జనం మదిలో మెదలుతూనే ఉన్నారు. గిరిజనం సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ కీకారణ్యాల్లో తిరిగిన సీవీఎస్ కే శర్మ, ఎపీవీఎన్ శర్మ, ఎంజీ గోపాల్ వంటి ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ వరంగల్ జిల్లా జనం నోళ్లలో నానుతున్నారంటే విధులపట్ల వారికి గల చిత్తశుద్ధికి నిదర్శనం ఆయా ఉదంతాలు.
కొందరు బ్యూరోక్రాట్ల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదనలో అర్థం లేకపోలేదు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై తాను సంతోషంగా లేనని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కుండబద్ధలు కొట్టడం చర్చనీయాంశమే. అనేక మంది అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదన్నది వాస్తవం. పేదోడికి సాయం చేయాలనే లక్ష్యానికి అడ్డు తగులుతూ, ఇబ్బంది పెట్టడం, ఫైళ్లపై నెగిటివ్ కామెంట్లు రాయడం తగ్గించుకోవాలని కూడా సీఎం రేవంత్ హితవు చెప్పారు. బహుషా ఈ ఏడాది కాలంలో సీఎంగా తనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఈ అంశాన్ని వెల్లడించి ఉండవచ్చు. అధికారుల ఆలోచనల్లో, విధానంలో మార్పు రావాలని కూడా సీఎం ఆకాంక్షించారు. తన 14.30 నిమిషాల ప్రసంగంలో సీఎం తన ఆవేదన యావత్తునూ చెప్పకనే చెప్పారు.

ఇంతకీ ఈ పరిస్థితికి కారకులెరనేదే అసలు చర్చ. ఐఎఎస్, ఐపీఎస్ లుగా ఎంపికైనవారు వివిధ విభాగాల్లో నిర్దేశిత రోజుల వరకు శిక్షణ తీసుకుంటారు. ఫీల్డు శిక్షణలో భాగంగా ఐఎఎస్ స్థాయి అధికారి ఎమ్మార్వో విధులను నిర్వహిస్తాడు. ఐపీఎస్ హోదాగల అధికారి పోలీస్ స్టేషన్ ముందు సెంట్రీ డ్యూటీని కూడా చేస్తాడు.క్షేత్రస్థాయి శిక్షణలో ఇదో భాగం. కానీ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపైనే సీఎం నిన్న తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యూరోక్రాట్లు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టుంగుల్లో చేరిన తర్వాతే అసలు సీన్ వారికి సాక్షాత్కరిస్తుంది. చదువూ, సంధ్యా లేని ఓ రౌడీ షీటరే కాదు, గల్లీ స్థాయి పొలిటికల్ లీడర్ కూడా సినీ ఫక్కీలో అధికారులను బెదిరించిన సంఘటనలు అనేకం. అధికార పార్టీ అండదండలు ఇందుకు ప్రధాన కారణమనేది అందరికీ తెలిసిందే. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.
కానీ ఇటువంటి ప్రతికూల పరిణామాల్లో గట్టిగా నిలబడాల్సిన బ్యూరోక్రాట్లు ఆత్మాభిమానాన్ని కోల్పోయి రాజకీయ నేతలకు వంగి వంగి సలామ్ కొట్టడం వెనుక దాగి ఉన్న కారణాలు నాణేనికి రెండో యాంగిల్. రెండు దశాబ్ధాల క్రితం ఓ మంత్రి కారు ఆగిందే తడవుగా ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు పోటీలు పడి మరీ కారు డోర్లు తీసి మంత్రికి సాగిలపడుతూ నమస్కరించిన దృశ్యాలు వార్తాంశాలుగా నిలిచాయి. బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో కొందరు ఐఎఎస్ లు, మరికొన్ని జిల్లాల ఎస్పీలు ‘దిగజారి’ ప్రవర్తించిన తీరు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మంత్రి జగదీషన్న జిందాబాద్ అంటూ నినదించిన సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉదంతమూ అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జగిత్యాలలో ఓ ఐఏఎస్ అధికారి అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందు మోకాళ్లపై మోకరిల్లిన ఉదంతం, ఒకటి రెండు జిల్లాల కలెక్టర్లే కాదు, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వంటి అధికారులు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఘటనలు ఉన్నతాధికారుల ప్రవర్తనా తీరుకు ఎప్పటికీ చెదిరిపోని దృశ్యాలే.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చెప్పినా చట్ట విరుద్ధ పనులు చేయడానికి నిరాకరించిన చీఫ్ సెక్రటరీలు ఉన్న చరిత్ర ఉండనే ఉంది. ఇదే దశలో పాలకుల మెప్పుకోసం పాకులాడినట్లు అభియోగాలు ఎదుర్కున్న శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి ఐఏఎస్ అధికారులు పడిన యాతనలూ ప్రజలకు తెలిసిందే. బీఆర్ఎస్ పాలనలో పాలకులకు అత్యంత సన్నహితులుగా పేరుగాంచిన అర్వింద్ కుమార్ వంటి ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఎదుర్కుంటున్న పరిణామాలూ రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. ఆయా అనేక ఉదంతాల నేపథ్యంలో ప్రస్తుతం కొందరు బ్యూరోక్రాట్లు ఎందుకు ఆత్మాభిమానాన్ని కోల్పోయి వ్యవహరిస్తున్నారనడానికి బోలెడు కారణాలు. పదవీ కాలం ఉండగానే రాజకీయ నాయకుల అవతారం ఎత్తాలనే కాంక్ష కారణం కావచ్చు. కేసీఆర్ కాళ్లు మొక్కిన సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కావడాన్ని ఈ సందర్భంగా ఉదహరించవచ్చు. కేసీఆర్ కాళ్లు మొక్కినా సరే హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ మాత్రం దక్కలేదన్నది వేరే అంశం.

సీఎం రేవంత్ ఉటంకించినట్లు.. శిక్షణా సమయంలోనే యూనిఫాం ధరించి సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్న కొందరు అధికారుల ప్రవర్తన ఆక్షేపణీయమే. వీరి వ్యవహారశైలి వెనుక అనేక కోణాలు ఉండవచ్చు. ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న అదనపు కలెక్టర్ స్థాయి అధికారుల కరెన్సీ దాహం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. నిర్దేశితం ప్రకారం దశలవారీగా కాకుండా పోలీసు శాఖలో ‘యాగ్జిలేటరీ’ ప్రమోషన్ల తరహాలో ఐఏఎస్ అధికారులకు లభించే కొన్ని పోస్టింగులు ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాలూ లేకపోలేదు. మంత్రులను ప్రసన్నం చేసుకోకుండా, వారి అనుమతి లేకుండా జిల్లాల్లో పోస్టింగులు లభించవనే పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత పాలకులదే. ‘యథా రాజ.. తథా అధికారి’ అనే పరిస్థితి తీసుకువచ్చి కలెక్టర్ల చేత కాళ్లు మొక్కించుకునే రాజకీయ నాయకుల ఆధిపత్యం కొనసాగినంత కాలం బ్యూరోక్రాట్ల పనితీరులో మార్పును ఆశించడం అత్యాశే కావచ్చు. సివిల్స్ చదివిన అధికారులను తమ అడుగులకు ముడుగులొత్తేలా మల్చుకోవాలనే లక్ష్యంతో వ్యవహరించే పాలకుల తీరు మారనంత కాలం టీఎన్ శేషన్, శంకరన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి బ్యూరోక్రాట్లను చూడగలమని భావించడమూ భ్రమగానే మిగలవచ్చు.
-ఎడమ సమ్మిరెడ్డి