(By తోట భావనారాయణ)
తమిళంలో వెలువడిన ‘తెలుగు సాహిత్య చరిత్ర’లో ఘోరమైన తప్పులున్నాయి. అది యూనివర్సిటీ స్థాయిలో తమిళ విద్యార్థులకు టెక్స్ట్ బుక్. అందుకే ఆ తప్పులను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ఒక చిన్న సమీక్షా వ్యాసం రాశా. అది చదివి చాలామంది తెలుగు నేలనుంచి ఆ యూనివర్సిటీకి, ఆంధ్రప్రభకీ ఉత్తరాలు రాశారు. చివరికి యూనివర్సిటీ వాళ్ళు ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
మద్రాసు వెళ్ళిన మొదటి నాలుగేళ్లలోనే తమిళం చదివి అర్థం చేసుకోవటం దాకా వచ్చింది. ఖాళీ దొరికితే తిరగటం అలవాటే కాబట్టి ఒకరోజు ఆలిండియా రేడియో స్టేషన్ కి వెళ్ళి గోపాలకృష్ణ గారిని కలిశా. (ఆయన ఆ తరువాత కాలంలో హైదరాబాద్ కేంద్రంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పని చేసి రిటైరయ్యారు). ఆయన దగ్గర కూర్చుంటే చాలా సంగతులు తెలుస్తాయి. తెలుగు, తమిళ కన్నడ భాషల్లో ఉద్ధండులాయన. మాటల సందర్భంలో ఒక పత్రిక గురించి చెప్పారు. మద్రాసు యూనివర్సిటీ ఆవరణలోనే ఉన్న ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఆయనా, బంగోరే (సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు బండి గోపాలరెడ్డి) ఏదో సీరియస్ గా వెతుకుతూ ఉంటే ఆ పత్రిక కనపడిందని, అది దొరికితే చాలా మంచి సమాచారం తెలుస్తుందని చెప్పారు. ఆయన చెప్పిన పత్రిక పేరు నోట్ చేసుకున్నాగాని ఆ వెతకటం కుదిరే పనికాదులెమ్మని నాలోనేనే అనుకున్నా.
ఎదురుగా కూర్చొని అలా మాట్లాడుతూ ఉండగా టేబుల్ మీద ఒక తమిళ పుస్తకం కనబడింది. “తెలుంగు ఇలక్కియ వరలారు” అని పైకే చదివా. “చదవటం వరకేనా, అర్థం కూడా తెలుసా?” అని అడిగారు. “తెలుగు సాహిత్య చరిత్ర” అన్నాను. “అయితే చదవండి” అంటూ పుస్తకం నా చేతికిచ్చారు. అంత సీరియస్ పుస్తకం చదవగలనా..? అని అనుమానిస్తూనే తీసుకున్నా. ఇంటికొచ్చాక చూస్తూ ఉంటే మొదటి ఐదారు పేజీల్లో ఆయన పెన్సిల్ తో కొన్ని చోట్ల మార్క్ చేసి ఉండటం కనిపించింది. గమనిస్తూ ఆ తప్పులు గుర్తుపట్టగలిగా. అలా చదువుతూ నేను కూడా పెన్సిల్ తో తప్పులున్న చోట మార్క్ చేశా. నాలుగైదు రోజులు అలా కష్టపడి చదివాక ఆయనకు ఫోన్ చేశా. “మీరు చదివారా?” అని అడిగితే తప్పులు చదవలేక వదిలేశానన్నారు. నేను కూడా చాలా తప్పులు చూశానని చెప్పి, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం కోసం ఒక సమీక్షా వ్యాసం రాస్తానని చెప్పా.

వ్యాసం రాయటానికి అందులో చాలా ముడిసరకు కనిపించింది. ఘోరమైన తప్పులున్నాయి. కేవలం అచ్చుతప్పులకు పరిమితం కాకుండా.. విషయం పరంగా ఉన్న తప్పులు అన్నీ ఇన్నీ కావు. విప్లవ కవితంలో పేర్కొనదగిన కవుల్లో కర్పూర వసంత రాయలు, సోమసుందర్, నాగభైరవ కోటేశ్వరరావు ఉన్నారని రాశారు. “విప్లవ కవిత్వంలో మొదటి స్థానం ఆక్రమించే కవితా సంకలనాలు గొటికలపూడి కమలనాథన్ నవనందిని, కిన్నెరవీణ అనే సంకలనాలున్నా”యట. ఏదో పుస్తకంలో చూసి రాస్తూ, పొరపాటున పేజీలు తిప్పటం వలన ఇలా జరిగిందేమో అనిపిస్తుంది.
చెళ్ళపిళ్ళ బదులు కిన్నెప్పుళ్ళ, మహాస్వప్న బదులు మగాస్వప్న, భానుమతీ రామకృష్ణ బదులు భానుమతీకృష్ణ, డీవీ నరసరాజు బదులు డీవీ నాగరాజు, దర్శి చెంచయ్య బదులు దాసి చెంచయ్య, చక్ర భ్రమణం బదులు చక్కర బ్రమనం, నాయని సుబ్బారావు బదులు నాయణను సుబ్బారావు, రంగనాయకమ్మ బదులు రంగనాయకియమ్మ .. ఇలాంటి తప్పులు వేలల్లో ఉంటాయి. పుస్తకం చవర్లో తప్పొప్పుల జాబితా ఇచ్చారు. వాళ్ళు ఒప్పుకొని దిద్దిన తప్పులను నేను ప్రస్తావించనే లేదు. ‘చెలియలికట్ట’ను సముద్ర తీరంగాను, వడ్లగింజలను వరికంకులు గాను, సూత పురాణాన్ని నిమ్న జాతులవారి పురాణంగాను, దువ్వూరి ‘భగ్న హృదయా’న్ని కాలిపోయిన హృదయం గాను, కడిమి చెట్టును పెద్ద చెట్టుగాను అనువదించి పారేశారు. రచనల పేర్లనే స్పృహ కూడా లేదు.
నవకవిత్వం (ఆధునిక కవిత్వం కాబోలు) రాసినవారిలో శ్రీశ్రీ, పుట్టపర్తి ఉన్నారంటూ శ్రీశ్రీ సరసన పుట్టపర్తి వారితో శివతాండవం చేయించారు. కవికర్ణ రసాయనాన్ని ‘కవికర్ణ రామాయణం’ చేశారు. తెలంగాణ రైతుల పోరాటానికి స్ఫూర్తినిస్తూ సోమేశ్వరన్, రెంటాల సుబ్బారావు ఎన్నో తెలంగాణ ఉద్యమగీతాలు రాశారట. వీరిలో సోమేశ్వరన్ తమిళుడా? రెంటాల గోపాలకృష్ణ, అనిశెట్టి సుబ్బారావు తెలుసు గాని రెంటాల సుబ్బారావు ఎవరు? నాగభైరవ కోటేశ్వరరావును, సోమసుందర్ ను కూడా విప్లవకవుల జాబితాలో చేర్చేశారు. గిడుగు ఛందోబద్ధ కవిత్వం రాశాడని, అల్లసాని పెద్దనకు రామరాజభూషణుడు శిష్యుడని, ఫిడేల్ అనే పాశ్చాత్య ఛందస్సులో పఠాభి తన ‘ఫిడేల్ రాగాల డజన్’ రాసినట్టు చెప్పుకొచ్చారు.
తెలుగు సాహిత్య చరిత్ర చెప్పే తొలి తమిళ గ్రంథమని వెనుక అట్ట మీద ఘనంగా చెప్పుకున్నారు. ఇతిహాసానికీ, పురాణానికీ తేడా తెలియని రచయితలు నన్నయ పురాణం రాశాడంటూ కవర్ పేజ్ మీదనే ముద్రించారు. 1994 లో నేను చదివే నాటికి మదురై కామరాజ్ యూనివర్సిటీ ఈ గ్రంథరాజాన్ని ప్రచురించి ఏడేళ్ళయింది.

రచయితల్లో ఒకరు డాక్టర్ టి ఎస్ గిరిప్రకాశ్ (ఎమ్మే పీఎచ్డీ, పీజీ డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్), మరొకరు పీఆర్ ఆనందకుమార్ (ఎమ్మే, ఎంఫిల్, డిప్లొమా ఇన్ తెలుగు, డిప్లొమా ఇన్ మలయాళం). అదే యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న ఈ జంట రచయితలు సృష్టించిన ఈ పుస్తకానికి వాళ్ళ శాఖాధిపతి, తెలుగు, తమిళ భాషలు బాగా తెలిసిన ప్రొఫెసర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు ముందుమాట రాసి యోగ్యతాపత్రం ఇచ్చేశారు.
ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం 1994 జూన్ 12 నాటి సంచికలో నేను రాసిన సమీక్షావ్యాసం అచ్చయింది. ఇంత దారుణమా అని ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అనేక యూనివర్సిటీల నుంచి మదురై కామరాజ్ యూనివర్సిటీకి లెటర్లు రాశారు. ఆంధ్రప్రభకు వచ్చిన లెటర్ల సంగతి సరేసరి. ఏడేళ్ళుగా ఎమ్మే తమిళ్ లిటరేచర్ విద్యార్థులు చదువుతూ ఉన్న ఆ పుస్తకాన్ని హడావిడిగా వెనక్కి తీసుకున్నారు యూనివర్సిటీ అధికారులు. రచయితల్లో తెలుగువారైన డాక్టర్ టి ఎస్ గిరిప్రకాశ్ కు నా మీద కోపమొచ్చింది. మద్రాసు యూనివర్సిటీ తెలుగు శాఖ ప్రొఫెసర్లు నాచేత రాయించారని అనుమానించారు కూడా. నేరుగా కలిసినప్పుడు మాత్రం “ రాయటానికి ముందు నాకు చెప్పి ఉండాల్సింది” అన్నారు బాధపడుతూ. “అది కొత్త పుస్తకమైతే చెప్పి ఉండేవాణ్ణేమో” అన్నాను గాని ఆయన బాధ తగ్గలేదు.
ఈ వ్యాసం వచ్చాక మళ్ళీ గోపాలకృష్ణ గారిని కలిశా. “బాగానే ఉంది గాని నేను చెప్పిన రీసెర్చ్ సంగతి ఏం చేశారు?” అని అడిగారు. ఇంకా మొదలుపెట్టలేదన్నాను. ఆ యూనివర్సిటీ వాళ్ళు తేరగా దొరికారని రాసి పడేశారు. కష్టపడాల్సింది మాత్రం పట్టించుకోలేదు అంటూ దెప్పి పొడిచారు. నాకు ఉక్రోషమొచ్చింది. కానీ టైమ్ దొరకలేదు. దొరికినప్పుడు ఏం చేశానో, ఆ పత్రిక కథేంటో, అది ఎంత విలువైనదో మరో పోస్టులో రాస్తా.
(అడగ్గానే ఐదేళ్ల ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధాలు, మూడేళ్ళ వార్త అనుబంధాలు పంపి ఇలాంటివి మళ్ళీ గుర్తు చేసుకోవటానికి, ఫేస్ బుక్ లో పంచుకోవటానికి సహాయపడిన మనసు ఫౌండేషన్ రాయుడి గారికి కృతజ్ఞతలు)
-వ్యాసకర్త: ప్రముఖ ఎడిటర్