ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నిన్నటి నుంచి ఒకటే చర్చ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా ఐదుగురు మంత్రులు పాల్గొన్న ముఖ్య కార్యక్రమాల్లో ఇదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కనిపించకపోవడమే ఆ చర్చకు కారణం. పొరుగు జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రులు సైతం పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో సొంత జిల్లా మంత్రి పాల్గొనకపోవడమేంటి? అందునా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో జరిగిన అట్టహాసపు అధికారిక కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వర్ రావుకు ఆహ్వానం లేదా? ఇదే నిజమైతే భట్టికి, తుమ్మలకు మధ్య గతంలో ఉన్నటువంటి సంత్సంబంధాలకు అగాధం ఏర్పడినట్లేనా? ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రామాణికంగా వేడి వేడి రాజకీయ చర్చ జరుగుతుండడమే అసలు విశేషం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వంగవీడు గ్రామంలో మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు రూ. 630 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టితోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్ట రాగమయి తదితరులు పాల్గొన్నారు.

ఆ తర్వాత మధిర ఇండోర్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు సందర్శించారు. స్టేడియంలో క్రీడాకారులతో ముచ్చటించారు. రోజు క్రీడా సాధనకు వస్తున్నారా? ఏమైనా అవసరాలు ఉన్నాయా? అంటూ స్టేడియం స్థితిగతులపై ఆయా మంత్రులు ఆరా తీశారు. ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేముందు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుని వివాహ వేడుకకు డిప్యూటీసీఎం సహా ఐదుగురు మంత్రులు హాజరయ్యారు. అయితే ఖమ్మం జిల్లాలో, డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో జరిగిన భారీ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరావు కనిపించకపోవడమే రాజకీయ చర్చకు ఆస్కారం కలిగించింది.
వంగవీడులో జరిగిన జవహర్ ఎత్తిపోతల శంకుస్థాపన కార్యక్రమంలో కేవలం మంత్రులే కాదు, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్ లు కూడా పాల్గొనం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆయా కార్యక్రమంలో కనిపించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ తరపున హాజరు కావడమనేది ప్రొటోకాల్ ప్రకారం అనివార్యం. వాకిటి శ్రీహరి జిల్లా ఇంఛార్జి మంత్రి కాబట్టి హాజరయ్యారు. కానీ తన శాఖ తరపున ఎటువంటి కార్యక్రమం లేకపోయినా ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కావడం గమనార్హం.

మంగళగిరిలో జరిగిన పెళ్లికి వీరందరూ ఒకే హెలీకాప్టర్ లో పయనించినందున అనుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారని భావించినా, ఇదే జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరు కావడం గమనించాల్సిన అంశంగా రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం భట్టి శిష్యునిగా ప్రాచుర్యం పొందిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మట్టా రాగమయిలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర గల తుమ్మల నాగేశ్వరావు మధిరలో జరిగిన కార్యక్రమాల్లో కనిపించకపోవడంపైనే ఆసక్తికర రాజకీయ చర్చ జరుగుతోంది.
భట్టి విక్రమార్క ఇలాఖాలో జరిగిన ఆయా కార్యక్రమాలకు తమ నాయకుడికి ఆహ్వానం అందలేదని తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన కార్యక్రమమే కావచ్చు, కానీ అది వ్యవసాయ శాఖతో అనుబంధ కార్యక్రమంగానూ తుమ్మల వర్గీయులు ప్రస్తావిస్తున్నారు. ఏరకంగా చూసినా తుమ్మలను ఆహ్వానించాల్సిన కార్యక్రమంగానే చెబుతున్నారు. అయితే మంత్రి తుమ్మల పీఏ తిలక్ కు మాత్రమే డిప్యూటీ సీఎం ఓఎస్డీ నుంచి మొక్కుబడిగా సమాచారం వచ్చిందనే అంశాన్ని కూడా తుమ్మల అనుచరులు కొందరు ఈ సందర్భంగా అంగీకరిస్తున్నారు. కానీ ఓ సీనియర్ మంత్రిని ఆహ్వానించాల్సిన పద్ధతి ఇది కాదనే వాదనను కూడా వారు తెరపైకి తీసుకువస్తున్నారు.
వాస్తవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుల మధ్య అనేక సంవత్సరాలుగా సత్సంబంధాలే ఉన్నాయనే ప్రచారం ఉండనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కాలంలోనే కాదు, అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనూ తుమ్మలతో భట్టికి రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వాదన ఉంది. తుమ్మల కాంగ్రెస్ లో చేరాక వీరిద్దరి మధ్య కొంతకాలంపాటు రాజకీయ బంధం మరింత బలోపేతమైనట్లు కూడా రాజకీయ చర్చ జరిగింది. కానీ ఇటీవలి కాలంలోనే భట్టికి, తుమ్మలకు మధ్య పొలిటికల్ గ్యాప్ ఏర్పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తుమ్మలకు ఆహ్వానం లభించలేదా? లేక ఇటీవల మధిర నియోజకవర్గానికికి చెందిన కమ్మ సామాజిక వర్గం నాయకుడొకరు కాంగ్రెస్ లో చేరిన ఘటన ప్రభావితపు ఫలితమా? అనే చర్చ కూడా ఈ సందర్భంగా జరుగుతుండడం గమనార్హం.

ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరిలు మధిరలో జరిగిన ఆయా కార్యక్రమంలో సంయుక్తంగా పాల్గొన్న రోజే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం విశేషం. సన్నాలకు బోనస్, రైతు బీమా వంటి అంశాల్లో నిధుల విడుదలకు సంబంధించి సీఎంతో తుమ్మల భేటీ అయ్యారు. వ్యవసాయ శాఖ సంబంధిత అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ తుమ్మలకు హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ భేటీ ప్రస్తావన దేనికంటే.. తుమ్మల రాజకీయ చతురతలోని అసలు మర్మం ఇందులోనే దాగి ఉందనేది జిల్లా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్య.