కన్న కూతురుపై గులాబీ బాస్ కేసీఆర్ కు ఇంకా కోపం తగ్గలేదా? తనను కలిసేందుకు వచ్చిన కూతురును కనీసం తన గదిలోకి కూడా రానివ్వలేదా? తన కుమారున్ని అమెరికాలో చదివించేందుకు, అతనికి తాతయ్య అశీర్వాదం ఇప్పించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ కు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ ఆమెను కలిసేందుకు ఇష్టపడలేదని తాజా వార్తల సారాంశం చెబుతోంది. శుక్రవారం వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతోంది.
తన చిన్న కొడుకు ఆర్యను అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదివించేందుకు ఎమ్మెల్సీ కవిత అమెరికా పయనానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తన కుమారుడు ఆర్యకు తాత ఆశీర్వాదం ఇప్పించేందుకు కవిత నిన్న కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన భర్త, ఇద్దరు పిల్లలు సహా కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లారు. కవిత ఫాంహౌజ్ కు చేరుకున్న సమయంలో కేసీఆర్ తన బెడ్ రూంలో ఉండగా, బయటి నుంచే తన తండ్రికి కవిత అభివాదం చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే కేసీఆర్ సతీమణి శోభ తన మనుమడిని కేసీఆర్ ఉన్న బెడ్రూంలోకి తీసుకువెళ్లారట. దీంతో తన మనుమడు ఆర్యను దగ్గరకు తీసుకుని కేసీఆర్ ఆశీర్వదించారట. బాగా చదువుకోవాలని కోరుతూ ఎంపిక చేసుకున్న కోర్సు, యూనివర్సిటీ పేరు, అమెరికా ప్రయాణం ఎప్పుడు? వంటి కుశల ప్రశ్నలతో మనుమడితో కేసీఆర్ ముచ్చటించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కవిత తన భర్త, పిల్లలతో హైదరాబాద్ తిరుగు పయనమై గత రాత్రి అమెరికా వెళ్లారు.
గులాబీ పార్టీ నిర్వహించిన ఎల్కతుర్తి సభ తర్వాత.. తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, తన తండ్రి దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని అనంతర పరిణామాల్లో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు విచారణ కోసం బయలుదేరిన సందర్భంలోనూ కవిత ఎర్రవల్లి ఫాం హౌజ్ కు వెళ్లారు. అప్పట్లోనూ కవిత ముఖం కూడా చూడకుండానే కేసీఆర్ బయలుదేరి వెళ్లిన దృశ్యానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు రాజకీయ చర్చకు దారి తీశాయి.

తాజాగా తన కుమారుని ఆశీర్వాదం కోసం ఫాం హౌజ్ వరకు వెళ్లిన కవితను తాను ఉన్న బెడ్ రూంలోకి ప్రవేశం కల్పించకుండానే, మనవడిని మాత్రం కుశల ప్రశ్నలు వేసి కేసీఆర్ అతన్ని ఆశీర్వదించినట్లు వచ్చిన వార్తలు ఆసక్తికర పరిణామంగా మారాయి. తన కూతురు కవితపై కేసీఆర్ కు కలిగిన కోపం ఇంకా తగ్గలేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. కాగా మొన్నటి రాఖీ పండుగ సందర్భంగా తన అన్నకు రాఖీ కట్టడానికి కవిత సిద్ధమైనప్పటికీ, కేటీఆర్ అందుబాటులో లేని ఘటన కూడా వార్తాంశంగా మారిన సంగతి తెలిసిందే.