Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సీపీ రాధాకృష్ణన్‌ ఎంపికలో బీజేపీ ఎత్తుగడ ఇదేనా!?

దేశంలో రెండో అత్యున్నత పదవికి బీజేపీ ఎంపిక చేసిన సీపీ రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వం అంశంలో ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడ దాగి ఉందా? దక్షిణాది రాష్ట్రాల్లో తమ పార్టీపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు, పార్టీ బలోేపేతానికి రాధాకృష్ణన్‌ ఎంపిక ప్రభావితం చేయనుందా? ఫలితంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై రాధాకృష్ణన్‌ ఎంపిక ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందా? బీజేపీకి చెందిన రాజ్ నాథ్ సింగ్, జెపీ నడ్డా వంటి దిగ్గజ నేతల పేర్లు సైతం ఈ పదవి విషయంలో వినిపించినప్పటికీ, తమిళనాడులోని కోయంబత్తూర్ ప్రాంతానికి చెందిన సీపీ రాధాకృష్ణన్‌ ను భారత ఉప రాష్ట్ర పదవి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో బీజేపీ దూరదృష్టి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పక్కా ఆర్ఎస్ఎస్ ముద్ర గల సీపీ రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వానికే ఎన్డీఏ మొగ్గు చూపడం వెనుక అనేక రాజకీయ అంశాలు దాగి ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా సాగుతుండడం విశేషం.

అనూహ్య రీతిలో ఉప రాష్ట్ర పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యం, అందుకు దారి తీసిన పరిణామాలపై భిన్న కోణాల్లో అనేక వార్తలు వెలువడిన పరిణామాల్లోనే, ఇదే పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ ను ఎంపిక చేసిన నేపథ్యంపైనా రాజకీయ చర్చ జరుగుతుండడం గమనార్షం. తన పదహారో ఏటనే ఆర్ఎస్ఎస్, జనసంఘ్ తో కలిసి పనిచేసిన రాధాకృష్ణన్‌ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. అంతకు ముందు ఆయన రాజకీయ నేపథ్యాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే.. కోయంబత్తూరు ఎంపీ స్థానం నుంచి రాధాకృష్ణన్‌ 1998, 1999 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004-2007 సంవత్సరాల్లో బీజేపీ తమిళనాడు అధ్యక్షునిగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుని హోదాలో రాధాకృష్ణన్‌ ఆ రాష్ట్రంలోని ప్రతి నియోకజకవర్గాన్ని చుడుతూ 93 రోజులపాటు 19,000 కి.మీ. రథయాత్ర కూడా నిర్వహించారు. నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, అంటరానితనం వంటి అంశాలపై ఆయన తన రథయాత్ర ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు.

ఇటువంటి రాజకీయ నేపథ్యం గల రాధాకృష్ణన్‌ ను ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ ఎంపిక చేయడంలో రాజకీయ లక్ష్యం ఉందనే ప్రచారం అప్పుడే ఊపందుకుంది. దక్షిణాది రాష్ట్రాల విషయంలో బీజేపీపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రక్రియలో భాగంగానే రాధాకృష్ణన్‌ ను ఈ పదవికి ఎంపిక చేశారనే వార్తలు రావడం ఈ సందర్భంగా గమనార్హం. అయితే తమిళ భాష ఉద్యమం, ఈ అంశంలో కేంద్రానికి కౌంటర్ గా అక్కడి స్టాలిన్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న రాష్ట్ర విద్యా విధానం, దక్షిణాది రాష్ట్రాల్లో వేళ్లూనుకుంటున్న వివక్ష ఉద్యమ ఛాయలు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలు కూడా రాధాకృష్ణన్‌ ఎంపికలో పరోక్షంగా ఇమిడి ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ఇప్పటి వరకు అనుసరించిన ఎత్తుగడలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలన్నివ్వలేదు. ముఖ్యంగా తెలంగాణా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడమనేది ఆ పార్టీ నాయకుల చిరకాల లక్ష్యమమనేది బహిరంగమే. అంతేగాక వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తంగా తమిళ రాజకీయాల్లోనే కాదు, యావత్తు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావితం చేసే ఎత్తగడలో భాగంగా రాధాకృష్ణన్‌ ను ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ ఎంపిక చేసిందనే పొలిటికల్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్

ఈ అంశంపై తమిళనాట పొలిటికల్ సర్కిళ్ల నుంచి అప్పుడే రియాక్షన్లు ప్రారంభం కావడం గమనార్హం. ఇందులో భాగంగానే డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ, ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ ఎంపిక చేసిన రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదన్నారు. తమకు ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వానికి తాము మద్దతివ్వాల్సిన అవసరం ఏముందని ఇళంగోవన్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు తమిళనాడును అన్ని విధాలుగా అవమానిస్తున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారని ఆయన విమర్శించారు.

తిరుచ్చి శివ

కాగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించడంతో విపక్ష ‘ఇండియా’ కూటమి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ కూటమి తరపున అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ‘ఇండియా’ కూటమి ప్రకటించే అవకాశాలున్నాయనేది ఆయా వార్తల సారాంశం. తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించగా, అదే రాష్ట్రం నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని ‘ఇండియా’ కూటమి భావిస్తోందట. వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుండగా, ఈనెల 21వ తేదీతో నామినేషన్ దాఖలుకు గడువు ముగియనుంది . ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకోసం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఇండియా కూటమి ఫోర్ల్‌ లీడర్లు సోమవారంనాడు సమావేశం కాగా, కూటమి అభ్యర్థిని ఈరోజే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొత్తంగా ఉప రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వానికి రాధాకృష్ణన్‌ ఎంపిక వెనుక బీజేపీ సుదూర రాజకీయ లక్ష్యం ఉందనే వాదనలు వినిపిస్తుండగా, ఈ ఎత్తుగడ ఎంతవరకు ఫలితాన్నిస్తుందనే అంశంపై వేచిచూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యాక సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఆర్. వెంకట్రామన్ ల తర్వాత తమిళనాడు నుంచి దేశంలో రెండో అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తిగానూ సీపీ రాధాకృష్ణన్‌ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. లోక్ సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్న కారణంగా ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నిక లాంఛనంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Popular Articles