అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ పార్క్, లకారం ట్యాంక్ బండ్ వద్ద యోగా పరివార్ సంస్థ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో ఎంపీ రఘురాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గని యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమ నిర్వాహకురాలు, లకారం ట్యాంక్ బండ్ యోగా టీచర్ శ్రీమతి కాసర శ్రీలతా రెడ్డి యోగాసనాలవల్ల ఉపయోగాలను వివరించారు. జీవన ప్రమాణాల మెరుగుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగాకోసం ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని కేటాయించుకుంటే ఆరోగ్యంగా జీవించే అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు.

తాము లకారం టాంక్ బండ్ వద్ద నిత్యం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో ప్రతి రోజు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు ఉదయం 5 గంటల నుంచి 6_30 వరకు పాల్గొంటారని శ్రీలతారెడ్డి చెప్పారు. గడచిన రెండేళ్లుగా ఇక్కడ క్రమం తప్పకుండా ప్రతి రోజు యోగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దాదాపు 100 మంది మహిళలు పాల్గొనగా, వీరిలో ప్రతిభారెడ్డి, మల్లంపాటి జ్యోతి, కవిత తదితరులు కూడా ఉన్నారు.
