Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఎవరు సార్ మీకు సలహాలు ఇస్తున్నది!?

ఎవరు సార్ మీకు సలహాలు ఇస్తున్నది? మిమ్మల్ని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నది? మీరు ఆలోచించరా? సెల్ఫ్ గోల్స్ రప్ప రప్పా వేసుకుంటున్నారు ఎందుకు?

పర్యటనలకు ఫుల్లుగా జనం వస్తున్నారు. మీ మీద అభిమానం ఉంటుంది. మీ చుట్టూ నేతలు ఉంటారు. మీరంటే చాలా మందికి ఇష్టం. డబ్బులు కసాబిసా పంచేశారు. కృతజ్ఞత కూడా ఉంటుంది! ఆ వీధి వాళ్లే కాదు.. ఆ చుట్టు పక్కల జిల్లా వాళ్ళూ వస్తున్నారు. అంతా బావుంది. కానీ, పర్యటన ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో.. ఆ అసలు పాయింట్ ఒక్కటే బావుండటం లేదు.

తెనాలి పర్యటనకు వచ్చారు. తీరా చూస్తే వాళ్ళు ముగ్గురు రౌడీ షీటర్లు అట. పోలీసులు అలా రోడ్డుపై శిక్ష వేయడం ముమ్మాటికీ తప్పు. మీరు ప్రశ్నించాల్సింది అలా శిక్ష వేయడాన్ని. మీరు తప్పు పట్టాల్సింది ఆ పోలీసుల దుశ్చర్యను. మీ ప్యాలెస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే బావుండేది. అంత దానికి వేలాది మందిని వెంటేసుకుని వారింటికి వెళ్లి పరామర్శించడానికి వారేమన్నా కడిగిన ముత్యాలా? పక్కా రౌడీ షీటర్లు! పార్టీ కార్యకర్తలై ఉండొచ్చు కానీ, వెనకా ముందు అలోచించి అడుగులు వేయాలి. పోనీ పాపం, ఆ ముగ్గురి కుటుంబాలకు కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు అయినా ఇచ్చి ఉంటే మీ ఓదార్పునకు అర్ధం ఉండేది. అసలు మీ వరకు వచ్చిందో లేదో కానీ, ఆ ముగ్గురిపై కేసులు నమోదైంది మీరు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే! అది మరచిపోతే ఎలా?

మొన్నా అంతే. రెంటపాళ్ళ వెళ్లారు. వెళ్లేముందు అతని హిస్టరీ తెలుసుకోవాలిగా! మీరు గెలుస్తారని రూ. 30 కోట్లు బెట్టింగ్ పెట్టిన వీరాభిమాని. ఎన్నికల ఫలితాల మరుసటి రోజే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని, నాలుగు రోజుల తరువాత చనిపోయాడు. అంటే అప్పుడు ప్రభుత్వం మీ హయాంలోనే వుంది. కూటమి ప్రభుత్వం 12న ప్రమాణ స్వీకారం చేసింది. వేధించింది ఎవరు? పోనీ, అప్పుడు పరామర్శ కు వెళ్ళలేదు. ఓకే, అతనికి విగ్రహం ఏర్పాటు ఏమిటో! అసలు విగ్రహాలకు అర్ధమే లేకుండా పోయింది! ఆ విగ్రహాన్ని మీరు ఆవిష్కరణ చేయడమేమిటో! మీరు వెళ్లే దారిలో పాపం ఇద్దరు చనిపోయారు. పోనీ, వారినైనా పరామర్శించి, ఆ కుటుంబాలకు చెరో ఐదు లక్షలు ఇచ్చి ఉంటే మీ ఇమేజ్ ఎక్కడికో పెరిగి పోయేది. కానీ అది చేయలేదు.

ఎన్నికల సమయంలో మీరు ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడి అభ్యర్థులను పక్కన నిల్చోబెట్టుకుని వీరు విజయసాయి రెడ్డి అన్న.. చాలా మంచోడు, అమాయకుడు, డబ్బులు కూడా లేవు అంటూ… ఇవే డైలాగులతో దాదాపు అందరు నాయకులను ప్రజలకు పరిచయం చేశారు గుర్తుందా? అదే పెద్ద తప్పు! ఒక్కొక్కరి గురించి ప్రజలకు అన్నీ తెలుసు. కానీ, మీరు ఫలానా వారిని గెలిపించాలి, నాకోసం గెలిపించండి అని ఉంటే, మీకోసం మా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కోసం తప్పనిసరిగా గెలిపించి వుండే వారు. కానీ మీకు తెలియని వారి వ్యక్తిత్వం గురించి వల్లె వేస్తేనే ప్రజలు ఇంకెటో వాళ్ల ఓటు వేసేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే తీరులో మీ వైసీపీ నేతల గురించి చెబుతుంటే అందరూ నవ్వుకున్నారు.

ఇక, మళ్ళీ కులాలు, మతాలు అవే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటారు. కమ్మ వారు మీ పార్టీలో ఉంటే వద్దన్న వారెవ్వరు? కావాలని వాళ్ళను ఇబ్బందులు పెట్టి వారి కులాల వారిని కష్టపెట్టుకుంటారా? మీరు వెనకేసుకు రావడంలో తప్పు లేదు. నాయకుడిగా మీరు చెయ్యాల్సిందే. కానీ మీరు మాట్లాడుతున్న మాటలన్నీ మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాయని జనం అనుకుంటున్నారు. మన ఐదేళ్ల పాలనను పూర్తిగా మీరే మరచిపోయారేమో అనిపిస్తోంది. అప్పుడు ఎందుకు పరామర్శలు లేవు? అప్పుడు ఎందుకు సమస్యలు గుర్తుకు రాలేదు? అప్పుడెందుకు పరదాలు కట్టుకున్నారు? ఇప్పుడు చేస్తున్న పర్యటనలు అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే పీఠం మళ్ళీ మీదే అయి ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు మరచిపోయారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు.

నాకు ఒక్కటి అనిపిస్తోంది. మీరు ప్రతిపక్షంలో ఉంటేనే బాగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని బాగా దునుమాడారు. లోపాలు ఎత్తి చూపించారు. బాగా కడిగి పారేశారు. అన్నీ బావున్నాయి కానీ, గతం మరచిపోయారేమో.. అనే అనుమానాన్ని కూడా నిజం చేశారు. ఇప్పటికైనా మించింది లేదు. జనం మీ వైపు కూడా ఉన్నారు. మంచి కార్యక్రమాలు, జనం మెచ్చే కార్యక్రమాలు ప్లాన్ చేయండి. చచ్చు సలహాలిస్తున్న కొందరిని దూరం పెట్టండి. దూరంగా ఉండి ఎదురు చూస్తున్న కొందరిని దగ్గరకు తీసుకోండి. మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవుతారు!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles