పులసో పులసో అనేసి వీకెండ్స్‌లో గోదారి జిల్లాలకు టూర్లు వేస్తుంటారు.
అంత ఎగేసుకుపోవలసినంత సినిమా ఏమీ ఉండదు. మా గోదారోళ్లకు value addition, hype creativity ఎక్కువ. కాబట్టి, ‘పుస్తెలు అమ్ముకునైనా పులస తినాలి, పెంకులు అమ్మేసయినా రామలు తినాలి’ లాంటివన్నీ పుట్టించారు!
రాత్రి తింటే తెల్లారాక బయటకు పోయేదానికి పుస్తెలు, పెంకులు అమ్మేయాలట!!
నిత్యం చేపలు తినేవారికి, food tastersకి మాత్రమే పులస చేప రుచి తెలుస్తుంది. ఉదాహరణకు నాకే తెలీదు. నేనూ గోదారి జిల్లావాణ్ణే. రమారమి 30 ఏళ్ళయి ఉండొచ్చు పులస తిని.
ఇప్పుడు పులస పెట్టినా, అదే పేరుచెప్పి మరొకటి పెట్టినా నాకు తేడా తెలీదు.
కాబట్టి, సచివాలయం చుట్టూ తిరిగే బ్రోకర్లకు, పైరవీకారులకు పులస చేపను వదిలేస్తే… ఆలి మెళ్ళో పుస్తెలు, ఇంటిపై పెంకులు మిగులుతాయి.
.
పులస వండడం ఓ టెక్నిక్! చాలా తతంగంతో కూడుకున్నది. వంశీ ‘మా పసలపూడి కథ’ల్లో ఒకచోట చాలా విపులంగా రాశారు.
పులసకంటే పోషక విలువలున్నవి, తెలివైనవి, రుచికరమైనవి, ప్రాచీన సాహిత్యం (హంసవింశతి)లో పేర్కొన్నవి చాలా ఉన్నాయి.
చేపలపై పరిశోధనలు జరిపిన సీవీ శేషగిరిరావు ఎన్నో విశేషాలతో పేపర్స్ సబ్మ్మిట్ చేశారు.
- ‘సొరచేప’ పౌష్టికతనిస్తుంది..
- ‘వాలుగ’ అందమైన కళ్లున్నది..
- ‘సందువా’ల్లో చమురు ఎక్కువగా ఉంటుంది..
- ‘ఇంగిలాం’ చేప వీర్యపుష్టినిస్తుంది..
- ‘గండుమీను’ గాల్ బ్లాడర్ (చేదుకట్టు) వైద్యానికి వాడతారట..
- ‘ఇసుకదొందు’ రక్తపుష్టినిచ్చి శారీరక బలాన్నిస్తుందట!
- సముద్రం లోపల సంచరించే ‘సావళ్లు’ సునామీని గుర్తించి బయటకొచ్చేస్టాయట!
- అంతెందుకు, ‘మునేలం’ అనే సముద్ర చేపకు ఒళ్లంతా ముళ్లే. దాన్ని సాదాసీదాగా పులుసు పెట్టినా అద్భుతంగా ఉంటుంది.
- By మణిభూషణ్
