చాలా విచిత్రంగా ఉంటుంది.. అదుగో పొగ అంటే ఇదుగో భారీ మంటలు అని దుమారం రేపే రోజులు ఇవి.. ఒకడు ఎంతో అమాయకంగా విషయాన్ని మలిచి పోస్ట్ వదులుతాడు. ఆ పోస్ట్ వెనుక రాజకీయ కోణం ఉంటుంది.. అది కుట్ర కోణం కూడా కావచ్చు! ఆ పోస్ట్ చూసిన ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెలరేగిపోతారు వారి వారి వాల్స్ లో! ఒకడు అసలు సెలబ్రిటీలకు చీమ అయినా కుట్టదా అంటాడు.. ఇంకొకడు పాత్రికేయులకు మీడియాకు పట్టదా అని ప్రశ్నిస్తాడు.. ఇంకొకడు అసలు ఇది సుమోటో గా స్వీకరించాల్సిన కేసు అని తేల్చేస్తాడు.. ఇదంతా ఆ కుట్ర కోణం తెరలేపిన గ్యాంగ్ చూసి నవ్వుకుంటూ ఉంటారు.. తమ పాచిక పారిందని పార్టీ చేసుకుంటారు.. ఒక్కోసారి రాజకీయంగా ఇలాంటివి పేలవచ్చు.. ఒక్కోసారి టపాకాయ తుస్సుమనవచ్చు.. కానీ, ఇక్కడ ఒక్కోసారి బలి అయ్యేది విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే!
ఉదాహరణకు రెండు తాజా విషయాలు. పాస్టర్ పగడాల ప్రవీణ్ దుర్మరణం. ఆయన మంచి దైవ ప్రసంగీకులు కావచ్చు. మంచి పేరు తెచ్చుకొని ఉండొచ్చు. ఆయన బుల్లెట్ పై రాజమండ్రి వెళుతూ ఆకస్మికంగా చనిపోయారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఎంతో మంది ఆవేశపడిపోయారు! ఒక మంచి మనిషి అలా కనుమూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. బాధలోంచి ఆవేశం పెల్లుబుకుతుంది. దాంతో ఎవరికి తోచిన బుర్ర వారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేలా ప్రేరణ కలిగిస్తుంది. ఇది సహజం, తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ, కొందరు దీన్ని రాజకీయ కుట్ర కోణంలో మలుచుకున్నారు. ఆ ఆవేశపు మంటల్లో ఆజ్యం పోసి రగిలించారు. తీరా కట్ చేస్తే ఏమయ్యింది? మూడు రోజుల్లో 300 పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి ఆధారాలతో సహా తేల్చి కళ్ళ ముందుంచారు పోలీసులు. ఇక పోస్టు మార్టం రిపోర్ట్ వచ్చాక నిజం నిగ్గుతేలుతుంది. పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. రెండు రోజుల్లో విషయం స్పష్టంగా తెలుస్తుందని హోమ్ శాఖ మంత్రి అనిత ప్రకటించారు నిన్న. కానీ, అంత వరకు సోషల్ మీడియా ఆగదుగా!?

అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల వివాదం. ఇదీ అంతే.. దీని గురించి పూర్తి వివరాలు తెలియకుండానే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తేల్చి పోస్టులు పెట్టేశారు. పైగా ఇతరులు ఇంకా స్పందించరేం అంటూ రెచ్చగొడుతున్నారు. అక్కడ ఎన్ని నెమళ్ళు, జింకలు ఉన్నాయో తెలియదు గానీ, బుల్ డోజర్ల చుట్టు నెమళ్ళు, జింకలు ఉన్నట్లుగా, అవి అల్లాడి రాత్రంతా అరుస్తున్నట్లుగా మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఎక్కడలేని వృక్ష ప్రేమ, వన్య ప్రాణులపై ప్రేమ చాటుకుంటున్నారు. వాస్తవం ఏమిటో తెలియదు. ప్రధాన ప్రతిపక్షం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. కానీ, ఈ పార్టీ ప్రభుత్వలో వున్నప్పుడు ఆ పక్కనే 25 ఎకరాలు మిత్రుడికి కేటాయించేశారు, అక్కడ నిర్మాణాలు జరిగిపోయాయి. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే రాజకీయం. బీజేపీ ఎంపీలు ఏకంగా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలసి ఏదో అన్యాయం జరిగిపోయినట్లు వినతి పత్రం సమర్పించారు. అంటే వారికి పూర్తి సమాచారం లేదు.. అదో రాజకీయం!
ప్రభుత్వం ఆయా వివరాలు సంబంధిత ఒప్పంద పత్రాలు మొన్ననే అన్నీ విడుదల చేసినా ఏదో రాద్దాంతం జరుగుతున్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం వివాదం నెలకొన్న 400 ఎకరాల భూమిని, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది యూనివర్సిటీ. ప్రతిగా 36, 37 సర్వే నంబర్లలో 405 ఎకరాలను ప్రభుత్వం యూనివర్సిటీకి బదలాయించింది. ఇదంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన వ్యవహారం. భూమికి భూమి తీసుకున్న తరువాత కూడా ఇక వివాదం ఏమిటి? ఎందుకు? గతంలో ఇందులో బిల్లీరావుకు చంద్రబాబు 200 ఎకరాలు కేటాయిస్తే, గత వైఎస్ఆర్ ప్రభుత్వం కోర్టు ను ఆశ్రయించింది. ఆ కేసు లో ఇప్పుడు ఇన్నాళ్లకు ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు ఈ భూమిని చదును చేస్తున్న సమయంలో విద్యార్థులు అడ్డుపడ్డారు. భూ మార్పిడి, కేసుల విషయం తెలియని రిజిస్ట్రార్ చెప్పిన మాటలు ఒకవైపు, రాజకీయ కోణాలు మరోవైపు చుట్టూముట్టి వివాదం కాస్త పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణ సంరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు విన్యాసం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు ఆధారాలతో సహా..

అయితే ఏది నిజం? ఏది అబద్ధం? ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వివిధ రకాలుగా చెలరేగిపోతూ, ఎవరి పార్టీ అభిమానులు ఎవరికి తోచినట్లుగా పోస్టులు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఎవ్వరిని తప్పు పట్టలేం. ఎవ్వరిని వద్దనలేం. కానీ నిజం కాస్త నిలకడగా బయటకొస్తుంది. అంత వరకు ఓపిక పట్టలేం. అదే ఈ వివాదాలకు కేంద్ర బిందువు. ఈ లోపు రాజకీయ కుట్రలు మీసాలు మెలేస్తుంటాయి. వారికి నచ్చినట్లు విన్యాసాలు చేయిస్తుంటాయి. ఇందులో విద్యార్థుల నుంచి మేధావుల వరకు అందరూ తెలివిగానో అమాయకంగా రాజకీయ యుద్ధంలో సైనికులుగా పని చేస్తుంటారు. ఆడిస్తున్న వారు తమాషా చూస్తుంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. అంతే అంతకన్నా ఏమీ లేదు!
– డా. మహ్మద్ రఫీ

