Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

అయ్యో.. కాళ్లు లేవనే జాలి చూపును ఇష్టపడని లీడర్!

సూదిని జైపాల్ రెడ్డి.. రెండుసార్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. మూడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా మూడు సార్లు తన ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకున్నారు.

నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నేత. ఎందరికో స్ఫూర్తి ప్రదాత. వీల్ చెయిర్ కు పరిమితమై భారత రాజకీయాల్లో చక్రం తిప్పిన మహా నాయకుడు. అందరిలా నడవలేకపోవచ్చు. కానీ, తన మేధస్సుతో, తన మానవతా దృక్పథంతో అందరి హృదయాల్లో నిలిచిన నేత ఎస్. జైపాల్ రెడ్డి.

జైపాల్ రెడ్డి పార్లమెంటiలో మాట్లాడుతున్నప్పుడు మిగతా సభ్యులు అభినందిస్తూ బల్లలు చరచడం అంటే చప్పట్లు కొట్టడం మినహా మరొకటి ఉండదు. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు కూడా విడిగా కలసి చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే. భారత రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తుల రాజకీయ చదరంగంలో తట్టుకుని నిలబడటమే కాకుండా పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా ఒకసారి, సమాచారశాఖ మంత్రిగా మరోసారి పని చేసి తన ప్రత్యేకతను, తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పారు.

తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాడ్గుల గ్రామంలో పుట్టి, హైదరాబాద్ లో స్థిరపడి దేశ వ్యాప్త గుర్తింపు పొందిన రాజకీయ దిగ్గజం. అయ్యో కాళ్ళు లేవనే జాలి చూపు ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అందుకే అటు చదువులో రాణించారు. అనూహ్యంగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి సంచలనాలు సృష్టించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో ఆయన కృషి ఎంతో ఉంది.

ఎస్. జైపాల్ రెడ్డితో వ్యాసకర్త డా. మహ్మద్ రఫీ

జైపాల్ రెడ్డి మనస్తత్వం సూటిగా ఉండేది. కార్యకర్తలను తిప్పుకోవడం, గాలిలో దీపం పెట్టే టైపు కాదు. అయితే అవుతుంది, లేదంటే ఇది కాదు.. అంతే. మరో మాట ఉండేది కాదు. సహజంగా అతనికి కాళ్ళు లేవు అని జాలితో సహాయం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ, ధైర్యం చేసి ఆయన దగ్గరకు వెళితే ఆ పని పూర్తయ్యేది. ఒకసారి నా మిత్రుడు రవిశంకర్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో తన సూట్ కేస్ మిస్ చేసుకున్నాడు. అతనికి అమెరికా వీసా ఇంటర్వ్యూ ఉంది. ఇంకొన్ని గంటలే ఉంది. అతను నాకు ఫోన్ చేసి టెన్షన్ పడ్డాడు. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? అని నేను ఆలోచిస్తున్న తరుణంలో ఢిల్లీలోనే ఉన్న జైపాల్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. ‘పదవిలో లేరు కదా..? ఆయనకు చెప్పడం అనవసరం’ అనిపించింది. ఆయన నా మనసులోని తడబాటు గుర్తించి ‘దేనికో వర్రీ అవుతున్నట్లున్నారు’ అని అడిగారు. మిత్రుడి సూట్ కేస్ విషయం చెప్పాను. ‘డోంట్ వర్రీ మళ్ళీ చేస్తాను’ అని పెట్టేశారు. అరగంట తరువాత తనే ఫోన్ చేసి ‘అతన్ని ఏదొక హోటల్ కు వెళ్లి రెస్ట్ తీసుకోమనండి, వీసా ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేయించాను’ అన్నారు. అన్నట్లుగానే ఎయిర్ పోర్ట్ వారు రెండో రోజు సూట్ కేస్ ఇవ్వడం, అదే రోజు వీసా ఇంటర్వ్యూ కు వెళ్లడం, వీసా కూడా వచ్చేయడం.. కట్ చేస్తే ఇప్పుడు రవిశంకర్ న్యూయార్క్ లో సెటిలైపోయారు. రవిశంకర్ ఇంట్లో జైపాల్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు. ఇలాంటి సేవలు మచ్చుకు ఎన్నో చెప్పుకోవచ్చు.

టి. సుబ్బిరామిరెడ్డి నాకు జైపాల్ రెడ్డిని పరిచయం చేశారు. అప్పట్లో నేను వార్తలో రాసే ఐటమ్స్ చదివి ఆయనకు నచ్చిన వ్యాసం గురించి ఫోన్ చేసి చెప్పేవారు. నా జర్నలిజం కెరీర్ లో నాకు సహాయపడింది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలే. ఒకరు జైపాల్ రెడ్డి, మరొకరు జితేందర్ రెడ్డి. నేను అమెరికా, యూకే పర్యటనలు చేయడానికి జైపాల్ రెడ్డి దోహదపడ్డారు. నేను నిలదొక్కుకునేందుకు జితేందర్ రెడ్డి సాయపడ్డారు. అందుకే నాకు జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నానుంచి ఏమీ ఆశించరు. నేను చెప్పుకోకూడదు కానీ, కేవలం నా నిజాయితీ రాతలు, నిక్కచ్చితనం ఇష్టపడతారు. నిన్న జైపాల్ రెడ్డిని కోల్పోయిన రోజు. గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతూ 2019లో జూలై 28వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నుమూశారు. ఒక మహానేత స్ఫూర్తి ప్రదాత ఆత్మీయులు జైపాల్ రెడ్డి వర్ధంతి నివాళులు అర్పిస్తూ నాలుగు మనసులో మాటలు పంచుకున్నాను. అత్యుత్తమ విలువలు, రాజకీయ ఆదర్శాలు, గాంధేయవాద సిద్ధాంతం రూపంలో జైపాల్ రెడ్డి జనంలో శాశ్వతంగా ఉంటారు.

– డా. మహ్మద్ రఫీ

Popular Articles