ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక నిఘాను సారించింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో పోలింగ్ సరళిని ఇంటెలిజెన్స్ విభాగపు అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రామోజీ రమేష్ సైతం ఏదులాపురంలోని వివిధ వార్డుల్లో పర్యటిస్తూ పరిస్థితిని స్వయంగా పరికిస్తున్నారు.

అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సీపీఐ మన్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ వేర్వేరుగా తలపడుతుండడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏదులాపురం మున్సిపాలిటీ ఉండడంతో ఇంటెలిజెన్స్ అధికారులు పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుండడం విశేషం. అదనపు ఎస్పీ స్థాయి అధికారి సహా సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కూడా వేర్వేరు వార్డుల్లో కలియదిరుగుతున్నారు.
వాస్తవానికి ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ఇతరత్రా సందర్భాల్లోనూ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సంచరిస్తూ సమాచార సేకరణ చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఏదులాపురం మున్సిపాలిటీలో అధికార, విపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో అటు ఇంటెలిజెన్స్, ఇటు స్పెషల్ బ్రాంచ్ అధికారుల సంచారం సహజంగానే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్పెషల్ బ్రాంచ్ విభాగపు అధికారులు కూడా ఏదులాపురంలో పరిస్థితిపై క్షేత్రస్థాయిలోనే తిరుగుతూ సమచార సేకరణ చేస్తున్నారు.

