Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘పదేళ్ల’ పుణ్యం..! నాలుగేళ్లకే కలెక్టర్!!

కనిష్టంగా ఎనిమిదేళ్లకు, గరిష్టంగా పదేళ్లకు కలెక్టర్ కావలసిన ఐఏఎస్ అధికారి నాలుగేళ్లకే జిల్లా పాలనను నడిపించే కలెక్టర్ స్థాయికి ఎదిగితే..? ఆఫీసర్లకు లక్కు కదా.. అనుకుంటున్నారా? ఐఏఎస్ లకు లక్కే కావచ్చు.. కానీ రెవెన్యూ వ్యవస్థతో పనులపరంగా సంబంధం గల ప్రజలకే అసలు నష్టమనేది కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల, రిటైర్డ్ కలెక్టర్ల వాదన. ఇందుకు బలం చేకూరేవిధంగా గులాబీ పార్టీ పాలనలో వడివడిగా నాలుగేళ్లకే కలెక్టర్లయిన కొందరు అధికారులకు ‘రెవెన్యూ’ వ్యవస్థపై పట్టు లభించకపోవడంతో ‘ధరణి’ చట్టం ఆసరాగా అక్రమార్కులు అనేక దురాగతాలకు పాల్పడిన దాఖలాలు ఉండనే ఉన్నాయి. ఈ అంశంలో ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థ వద్ద కోకొల్లలుగా పేరుకుపోయిన భూ వివాదాలు, కేసులు, అప్పీళ్లు వంటి ఉదంతాలే అందుకు నిదర్శనం. ఐఏఎస్ అధికారులు కలెక్టర్లు కాకూడదా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. అందుకు సంబంధించి పాలకులు అనుసరించే ‘పద్ధతి’పైనే అసలు చర్చ జరుగుతోంది. తాజాగా ‘ట్రెయినీ ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్’లుగా పోస్టింగులు లభించిన తీరుపైనే సిసలైన సమీక్ష. ఇక విషయంలోకి వెడితే..

తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిన 2023 బ్యాచ్ కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులకు ‘సబ్ కలెక్టర్లు’గా ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. నారాయణఖేడ్, భైంసా, ఆర్మూర్, కల్లూరు, భద్రాచలం, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లలో ఆయా అధికారులను సబ్ కలెక్టర్లుగా నియమించింది. ఈ నేపథ్యంలోనే కల్లూరు రెవెన్యూ డివిజన్ కు సబ్ కలెక్టర్ హోదా కల్పించినట్లు ఓ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. నిజానికి రెవెన్యూ వ్యవస్థలో ప్రత్యేకంగా ‘డివిజన్ల’కు సబ్ కలెక్టర్ హోదా అనేది ఏమీ ఉండదు. ఈ డివిజన్లలో రెవెన్యూ పరంగా పాలనా వ్యవహారాలు చూసే అధికారుల కేడర్ ప్రకారం.. ఆర్డీవోలుగా, సబ్ కలెక్టర్లుగా వ్యవహరిస్తారు. సాధారణంగా ర్యాంకర్లను, అంటే ఎమ్మార్వో నుంచి పదోన్నతులతో డివిజన్ స్థాయికి ఎదిగిన అధికారిని, గ్రూపు వన్ అధికారులను ఆర్డీవోలుగా, ఐఏఎస్ అధికారులయితే సబ్ కలెక్టర్లుగా వ్యవహరిస్తారు.

కానీ అన్ని రెవెన్యూ డివిజన్లలో పాలనా వ్యవహారాలు చూసే ఐఏఎస్ అధికారులు సబ్ కలెక్టర్లు అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. రెవెన్యూ డివిజన్లలో ‘నోటిఫైడ్’ చేసిన కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారిని మాత్రమే సబ్ కలెక్టర్గ గా వ్యవహరిస్తారు. ట్రెయినీ ఐఏఎస్ లకు నోటిఫైడ్ రెవెన్యూ డివిజన్లలో మాత్రమే సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇస్తుంటారు. నోటిఫై చేసిన డివిజన్లలో రెవెన్యూ వ్యవస్థ గురించి ఆకళింపు చేసుకునే అవకాశాలు అపారంగా ఉంటాయి. ఇక్కడ సబ్ కలెక్టర్ గా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంతగా పని ఉంటుంది. సబ్ కలెక్టర్ గా బాధ్యతలు పూర్తయ్యాక సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లకు ప్రాజెక్టు అధికారులుగా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్ డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, మున్సిపల్ కమిషనర్లుగా తదితర బాధ్యతలను నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్లుగా నియమితులవుతుంటారు. మొత్తంగా ఆయా పోస్టుల్లో కనిష్టంగా ఎనిమిదేళ్లు, గరిష్టంగా పదేళ్లపాటు ఐఏఎస్ అధికారులు విధులు నిర్వహించడం ద్వారా సుమారు వంద ప్రభుత్వ విభాగాలపై పట్టు సాధిస్తారు. ఆ తర్వాతే జిల్లా కలెక్టర్ గా వారికి అవకాశం, పోస్టింగ్ లభిస్తుంది. దీంతో సమర్ధవంత ఐఏఎస్ అధికారులుగా, ప్రజల మేలు కోరే కలెక్టర్లుగా ప్రాచుర్యం పొందుతుంటారు. ఇది గత పద్ధతి.

కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణాలో జరిగిందేమిటి? సబ్ కలెక్టర్ గా, వివిధ విభాగాల ప్రాజెక్టు అధికారులుగా, మున్సిపల్ కమిషనర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా పోస్టులేవీ నిర్వహించకుండానే అనేక మంది ఐఏఎస్ అధికారులు నేరుగా అదనపు కలెక్టర్లుగా, కలెక్టర్లుగా నియమితులయ్యారు. కొందరు ఐఏఎస్ లకు అదనపు కలెక్టర్లుగా ఇచ్చిన పోస్టింగుల్లోనూ రెవెన్యూ వ్యవస్థపై ఏమాత్రం పట్టు లభించని పరిస్థితి ఏర్పడడం గమనార్హం. జాయింట్ కలెక్టర్ అనే పదాన్ని తొలగించి, ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున అదనపు కలెక్టర్లను నియమించారు. ఇందులో ఒకరు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కావడం, ఈ పోస్టులో ఎక్కువగా ఐఏఎస్ అధికారులనే నియమించడం గమనార్హం. దీంతో గ్రామ పంచాయతీలపై తప్ప మిగతా వ్యవస్థలపై అనేక మంది ఐఏఎస్ లకు పట్టు లేకుండా పోయిందనేది కొందరు రిటైర్డ్ కలెక్టర్ల అభిప్రాయం.

అందువల్లే ‘ధరణి’ పోర్టల్ నిర్వహణలో కొందరు ఐఏఎస్ అధికారులు తీవ్ర వివాదాస్పదమయ్యారని, పట్టు లభించని కారణంగా కంప్యూటర్ ఆపరేటర్లపై ఆధారపడడం కొందరు అధికారులకు అనివార్యమైందనేది రిటైర్డ్ అధికారుల వాదన. కొందరు అధికారులు పట్టుదలతో రెవెన్యూ వ్యవస్థపై పట్టు సాధించేసరికే జరగాల్సిన తప్పిదాలు జరిగిపోయాయనేది రిటైర్డ్ అధికారుల విశ్లేషణ. జిల్లాల సంఖ్య పెరగడం, సరిపోను సంఖ్యలో ఐఏఎస్ అధికారులు లేకపోవడం వంటి కారణాలు ఏవైనా కావచ్చు, బీఆర్ఎస్ పదేళ్ల పాలన పుణ్యం వల్ల ఎనిమిదేళ్లకు, పదేళ్లకు కలెక్టర్ కావలసిన అధికారి నాలుగేళ్లకే జిల్లా పాలనను నిర్వహించారనేది బహిరంగమే. ఒకరిద్దరు అధికారులైతే కనీసం అదనపు కలెక్టర్ పోస్టును కూడా నిర్వహించకుండా నేరుగా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఉదంతాలూ లేకపోలేదు. అటువంటి ఒకరిద్దరు అధికారులు ఐఆర్ఎస్ లో పనిచేశారనే వాదన ఉందనేది వేరే విషయం.

ఈ రీతిన ఇంకొందరు అధికారులకు గులాబీ పార్టీ పాలనలో లభించిన ‘కలెక్టర్’ పోస్టు పాలకులపై వారిలో అమితభక్తిని పెంపొందించిందనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ హుందాగా వ్యవహరించాల్సిన అధికారులు ముఖ్యమంత్రి హోదాలో గల కేసీఆర్ సారు కాళ్లు మొక్కి వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇటువంటి అధికారులు కొందరు ఆ తర్వాత సీన్ లో గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులుగానూ మారారు. ఇంకొందరు వెయిటింగులో ఉన్న పరిస్థితుల్లోనే ‘కారు’ పార్టీ అధికారానికి దూరమైంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో జిల్లా పాలనా పగ్గాలు చూసే అధికారుల వర్క్ స్టైలే మారిపోయిందనేది కాదనలేని వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క ఐఏఎస్ అధికారి కూడా సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన దాఖలాలు లేవని రిటైర్డ్ కలెక్టర్ ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే.. పదేళ్ల గులాబీ పార్టీ పాలనలో ఐఏఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్లుగా రెవెన్యూ పనితీరుకు పట్టు లభించని స్థితి ఏర్పడింది. రెవెన్యూ వ్యవస్థలో కళ్లముందు కనిపిస్తున్న అనేక ‘ఫలితాల’కు గాడి తప్పిన గత పోస్టింగులే కారణమనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధికారులకు తాజాగా ‘సబ్ కలెక్టర్లు’గా నోటిఫైడ్ రెవెన్యూ డివిజన్లలో పోస్టింగులు ఇవ్వడం పాలనా పరంగా జరుగుతున్న మార్పులకు ఓ సంకేతంగా రెవెన్యూ శాఖకు చెందిన రిటైర్డ్ అధికారులు నిర్మొహమాటంగా ప్రస్తావిస్తున్నారు.

Popular Articles