Top 5 This Week

Related Posts

హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం హైకోర్టుకు హాజరై క్షమాపణ కోరారు. ఎ. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైడ్రాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రంగనాథ్ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. వివరాల్లోకి వెడితే.. బతుకమ్మకుంట పరిధిలోని ఓ ప్రైవేట్ స్థలానికి సంబంధించి స్టేటస్ కో ఆదేశాలను కొనసాగించాలని గత జూన్ 12వ తేదీన ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారనేది ఆరోపణ. ఇదే అంశంపై రంగనాథ్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈకేసును గత అక్టోబర్ 31వ తేదీన విచారించిన తర్వాత కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో నవంబర్ 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆదేశించింది. అయితే అత్యవసర పనుల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు పేర్కొంటూ రంగనాథ్ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ, కోర్టు తలచుకుంటే ధిక్కరణను ఎదుర్కుంటున్న హైడ్రా కమిషనర్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు అభ్యర్థనను నిరాకరిస్తూ కమిషనర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు స్వయంగా హాజరై క్షమాపణ చెప్పారు.

Popular Articles