Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడున్నా పట్టుకొస్తా: N Tvపై సజ్జన్నార్ సీరియస్

హైదరాబాద్: తెలుగు న్యూస్ ఛానల్ N Tv ముఖ్యుల వ్యవహార తీరుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎందుకు పారిపోతున్నారు? విచారణకు వస్తామని ఎందుకు రాలేదు? మీ సీఈవో ఎక్కడ? యాంకర్ దేవి విచారణకు వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్లారు? ‘సిట్’ అంటేనే దర్యాప్తు చేస్తుంది. ఎందుకు ఇవ్వాలి నోటీసు? విచారణకు సహకరించకుండా ఎందుకు పారిపోతున్నారు? ఒక రిపోర్టర్ బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నించారు. సాయంత్రం 5.30 గంటలకు టికెట్ బుక్ చేసుకున్నారు (ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన దొంతు రమేష్ ను ఉద్దేశించి) ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా..’ అని సజ్జన్నార్ స్పష్టం చేశారు.

బుధవారం ఆయన నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి మీడియాతో మాట్లాడుతుండగా, ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు అంశంపై అదే ఛానల్ కు చెందిన మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై సీపీ సజ్జన్నార్ తీవ్రంగా స్పందించారు. ‘ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా వార్తా కథనం ప్రసారం చేస్తారా? స్త్రీ అంటే అమ్మ.. అమ్మను పూజిస్తేనే అంతా సుభిక్షంగా ఉంటుంది. మహిళను అవమానించడం క్రూరత్వం. మీ దగ్గర ఏం ఆధారం ఉందని ఆ మహిళా ఐఏఎస్ అధికారి గురించి రాశారు? మీ సీఈవో ఎక్కడ ఉన్నారు? వాళ్లు కరెక్టుగా ఉంటే విచారణకు ఎందుకు రావడం లేదు? ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని సజ్జన్నార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

తాము చట్టబద్దంగానే వ్యవహరిస్తామని, ఎన్టీవీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. సిట్ దర్యాప్తులో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయని, ఎన్టీవీ ఆఫీసులో తనిఖీలు కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. తాము తలుపులు ఎక్కడ బద్దలు కొట్టామో చూపాలని ఆరోపణ చేసిన మహిళా జర్నలిస్టును సజ్జన్నార్ నిలదీశారు. ఈ కేసులో ఎవరున్నా విచారణ చేస్తామని, సహకరించకుంటే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు.

Popular Articles