హైదరాబాద్: మహానగరం మూసీ నది వరదల్లో చిక్కుకుంది. ప్రజా రవాణాలో ప్రసిద్ధి గాంచిన ఎంజీబీఎస్ బస్టాండ్ ను వరద ముంచెత్తింది. బస్ స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. దీంతో బస్ స్టేషన్ ను తాత్కలికంగా మూసివేశారు. మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జీల పైనుచి వరద ప్రవహిస్తోంది. అదేవిధంగా మూసీ వరదకు గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీట మునిగింది. పలు కుటుంబాలు వరదలలో చిక్కుకున్నాయి. సహాయక చర్యల కోసం పలు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. నిన్న రాత్రి నుంచే భవనాల పైకి ఎక్కిన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు. బోట్ల ద్వారా డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలను అందిస్తున్నాయి.
కాగా వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో నదీ పరీవాహక ప్రాంతంలో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అర్ధరాత్రి ఇమ్లిబన్ సమీపంలో ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించారు.

ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావటంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్ హైడ్రా, జీ ఎచ్ ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు.

