కొత్తగూడెం: లారీ కంటెయినర్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బస్తాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సుజాతనగర్ మండలం వేపలగడ్డ సమీపంలోని ఓ బేకరీ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, గంజాయి బస్తాలతో వెడుతున్న లారీ కంటెయినర్ పట్టుబడినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన జగదీష్ దయారాం, సంజుకుమార్ అనే వ్యక్తులు భద్రాచలం నుంచి కొత్తగూడెం, ఖమ్మం మీదుగా రాజస్థాన్ లోని జైపూర్ కు లారీ కంటెయినర్ లో భారీ ఎత్తున గంజాయిని రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి తన సిబ్బందితో వాహన తనిఖీ చేస్తుండగా, KA38 A6754 అనె నెంబర్ గల లారీ కంటెయినర్ వచ్చింది. దాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో రూ. 2.50 కోట్ల విలువైన 96 బస్తాల గంజాయి పట్టుబడినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ వివరించారు.
ఈ ఘటనలో లారీలో గల నిందితులు జగదీష్ దయారాం,సంజుకుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ రవాణాతో సంబంధం గల మరో ఇద్దరు నిందితులైన మహారాష్ట్రకు చెందిన అమిత్ రోహిదాస్ పాటిల్, ఒడిషాకు చెందిన హరి అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఫొటో: పట్టుబడిన గంజాయి బస్తాలు, నిందితులతో భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇతర పోలీసు అధికారులు