హైదరాబాద్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ పట్టనుంది. భట్టి ప్రత్యేక చొరవతో వివిధ మార్గాల్లోని రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు రూ. 594.00 కోట్లు మంజూరయ్యాయి. ఫలితంగా ఖమ్మం జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. భట్టి విక్రమార్క పట్టుదలతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు (జీవో ఎంఎస్ 15 /16-03-2026) ఏకంగా రూ. 594 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం. ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల (ఫోర్ లేన్) రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ రదారుల విస్తరణ వల్ల ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాలకు కనెక్టివిటీ పెరగండతో పాటు స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా వేస్తోంది. నిధులు మంజూరైన మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి:

- జగ్గయ్యపేట, బోనకల్ , రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా, సోమవరం మీదుగా వైరా వరకు మొత్తం 25.2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ. 151.20 కోట్ల నిధుల మంజూరు.
- మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణ చేపట్టనున్నారు. మధిర, జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్యణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు విస్తరణ చేయనున్నారు. ఈ రహదారి మొత్తం 13.50 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ. 81 కోట్ల నిధుల మంజూరు.
- మధిర నుంచి ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ జరగనుంది. మధిర, ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. ఈ రహదారి మొత్తం 18.40 కిలోమీటర్ల మేర రూ.110.40 కోట్ల నిధులు మంజూరు.
- ఖమ్మం నుంచి కొత్తూరు, ధంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు రహదారి విస్తరణ చేయనున్నారు. ఈ మార్గంలో మొత్తంగా 28.03 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.157.23 కోట్ల నిధుల మంజూరు.
- బోనకల్ నుంచి ఆళ్లపాడు, రాయన్న పేట మీదుగా వంగవీడు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఆ మార్గంలో మొత్తంగా 15.72 కిలోమీటర్ల మేర రహదారికి విస్తరణకు రూ.94.32 కోట్ల నిధుల మంజూరు అయ్యాయి.
