(సమీక్ష ప్రత్యేకం)
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఓటమి చెందిన వ్యక్తి కౌంటింగ్ సెంటర్ లోనే ఏడిస్తే, విజయం సాధించిన వ్యక్తి ఇంటికి వెళ్ల దుఃఖిస్తాడనేది పొలిటికల్ సామెత. తెలంగాణాలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో విజేతలు, పరాజితులు ఇదే నానుడి తరహాలో వేర్వేరు ప్రాంతాల్లో ఏడ్వడం గ్యారంటీగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు.. ఏ నగరపాలక సంస్థలో చూసినా, మరే మున్సిపాలిటీలో చూసినా అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడైనట్లు వివిధ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే..
రాష్ట్ర రాజధాని మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక్కో ఓటుకు ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన ఖర్చు రూ. 70 వేలు (ట). ఇక్కడ ప్రతి ఓటుకు కనిష్టంగా రూ. 40 వేలు, గరిష్టంగా రూ. లక్ష చొప్పున పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖర్చు చేశారుట. ఇక పట్టుచీర, లిక్కర్ బాటిల్, బియ్యం బస్తా, ఉప్పూ, పప్పూ, నూనెడబ్బా వంటి నెలకు సరిపడా వంట సరుకులనూ పంపిణీ చేశారట. ఓ స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ కౌన్సిలర్ పదవి కోసం రూ. 5.00 కోట్లు ఖర్చు చేశారుట. రియల్ ఎస్టేట్ ప్రభావం తీవ్రంగా గల మొయినాబాద్, శంకర్ పల్లి తదితర ప్రాంతాల్లో అభ్యర్థులు ఇంత భారీ ఖర్చు చేయడంలో మతలబు ప్రజలకు అర్థంకాని విషయమేమీ కాకపోవచ్చు.

అదేవిధంగా రాజధాని సమీంలోని వికారాబాద్ మున్సిపాలిటీలో జనరల్ వార్డుల్లో ఒక్కో అభ్యర్థి రూ. 30 లక్షలు ఖర్చు చేశారట. తాండూరులో ఓటు విలువవ రూ. 3 వేలు పలికిందట. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో ఓటు విలువ రూ. 2 వేలు పలికినట్లు వార్తలు వచ్చాయి. మొయినాబాద్, తాండూరు, వికారాబాద్, కొడంగల్ మున్సిపాలిటీల్లో అత్యధికంగా, అత్యల్పంగా పలికిన ఓటు విలువను కాసేపు పక్కనబెడితే, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే చైతన్యవంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో వెదజల్లిన ఖర్చు మొత్తం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
వైరా మున్సిపాలిటీలో ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి వైస్-చైర్మెన్ పదవిపై ఆశతో రూ. 1.90 కోట్లు పార్టీ ఫండ్ గా అందించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం కాకుండా, తాను ఎన్నికల్లో గెలవడానికి మరో రూ. 20.00 లక్షల వరకు ఖర్చు చేశారట. ఇక కల్లూరు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడా వైస్ చైర్మెన్ పదవి ఇస్తామని పార్టీ నేతలు ఆశ చూపడంతో రూ. 1.25 కోట్లు పార్టీ ఫండ్ కింద చెల్లించుకున్నారట. ఇదిగాక ఓటుకు రూ. 2 వేల చొప్పున మరో రూ. 20 లక్షలను ఓటర్లు ముట్టచెప్పారట.

అదేవిధంగా అశ్వారావుపేటలో కూడా వైస్ చైర్మన్ పదవి కోసం ఓ అభ్యర్థి రూ. 1.60 ఖర్చు పార్టీకోసం అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. వైస్ చైర్మెన్ పదవి కోసం ఆశతో ఆయా భారీ మొత్తాలను పార్టీ నిధికి జమ చేసిన అభ్యర్థులు ఇప్పుడు గెలుస్తారా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందట. మొత్తంగా పరిశీలించినపుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న తాజా పరిణామం ఏమిటంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెంలో ఓటు విలువ అత్యధికంగా రూ. 10 వేలు పలికింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి జిల్లాల్లో ఈ విలువ స్థిరీకరణను పొందింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రూ. 500 నుంచి రూ. 1,000 వరకు మాత్రమే అభ్యర్థులు ఓటర్లకు పంపిణీ చేశారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ‘రిజర్వుడ్’ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లోనూ ఓటు విలువ అమాంతంగా రూ. 10,000 పెంచేసిన ఘనత రాజకీయ పక్షాలదే. ప్రత్యర్థి రూ. 2 వేలు ఇస్తే, అందుకు అదనంగా మరో రూ. 500, వెయ్యి వరకు పెంచేస్తూ, మొత్తంగా రూ. 10 వేల వరకు పలు ప్రాంతాల్లో ఓటుకు నోటు చొప్పున పంచేసినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధమయ్యే రాజకీయ నాయకులు ఓటుకు కనీసంంగా రూ. 10వేల చొప్పున ఖర్చు చేసేందుకు సంసిద్ధం కావాలన్నమాట.

ఆయా ఖర్చుల వివరాలను చదివాక గెలిచిన అభ్యర్థి, ఓటమి చెందిన నాయకుడు ఏయే ప్రదేశాల్లో ఏడుస్తారనేది రాజకీయ నానుడిని మరోసారి గుర్తుకు తెచ్చుకుని అవగతం చేసుకోవచ్చు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థలో రూ. 30.00 లక్షల నుంచి, రూ. 50.00 లక్షల వరకు ఖర్చు చేసిన పలువురు కార్పొరేటర్లు ఈసారి పోటీకి ససేమిరా అంటున్నారు. అప్పటి ఎన్నికల్లో చేసిన ఖర్చుల అప్పులు ఇప్పటికీ తీరకపోవడమే అందుకు కారణం. పలువురు కార్పొరేటర్లు భూకబ్జాల వంటి వివిధ ఆరోపణల్లో కూరుకుపోయినప్పటికీ, అనేక మంది అప్పులపాలై బేజారయ్యారనేది కానదలేని వాస్తవం. అదీ అసలు సంగతి.

