మావోయిస్టు నక్సల్స్ మందుపాతరలు పేల్చడం, అనేక మంది పోలీసులను బలి తీసుకోవడం, ఇటువంటి ఘటనల్లో సామాన్యులు సైతం సమిధలుగా మారిన సందర్భాలు అనేకం. కల్వర్టుల కింద టిఫిన్ బాక్సుల్లో మంతుపాతరలు ఏర్పాటు చేసి వైర్ల కనెక్టివిటీతో, రిమోట్ సాయంతో పేలిస్తే పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాలు 60 నుంచి 150 అడుగుల వరకు ఎగిరిపడిన ఉదంతాలు విప్లవోద్యమ చరిత్రలో అనేకం. తెలంగాణాలో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ పాల్పడిన ఇటువంటి ఘాతుకాలు అనేకం. ఇక పొరుగున గల ఛత్తీస్ గఢ్ లో జరిగిన పేల్చివేతల పరిణామాలు ప్రస్తుతం చూస్తున్నదే. అయితే ఇటువంటి మందుపాతరల పేల్చివేతల్లో మావోయిస్ట్ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రమే నిపుణులుగా పేరు గాంచారు.
ఎంచుకున్న ‘టార్గెట్’ మిస్సవ్వకుండా ఖచ్చితత్వంతో ఛేదించడంలో ముఖ్య నక్సల్ నేతలు పలువురు పోలీస్ రికార్డుల్లో ప్రాముఖ్యతను సంపాదించారు. అటువంటి నక్సల్ నాయకుల్లో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ముందు నేడు అధికారికంగా లొంగిపోతున్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అగ్రగణ్యుడనే పేరుంది. ఐటిఐ పాలిటెక్నిక్ చదువుకున్న ఆశన్న ‘టెక్’ నైపుణ్యానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం) సంస్థకు చెందినవారు సైతం ఉలిక్కిపడ్డారంటే ఆశ్చర్యం కాదు. మూడున్నర దశాబ్ధాలపాటు శ్రీలంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన LTTE సంస్థ గురించి తెలిసిందే. అటువంటి LTTE సంస్థ ప్రతినిధులు కూడా నివ్వెరపోయేలే చేసిన ఘటనకు పాల్పడినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన ఆశన్న పేల్చిన మందుపాతర ఘటనకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ లోకి వెడితే..

ఎలిమినేటి మాధవరెడ్డి గుర్తున్నారు కదా? చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో కీలక హోం, పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ లీడర్. చంద్రబాబు ప్రభుత్వంలో తమను క్రూరంగా అణచివేస్తున్నారని భావించిన అప్పటి పీపుల్స్ వార్ (ప్రస్తుత మావోయిస్ట్) అధికార పార్టీ నాయకులను అప్పట్లో టార్గెట్ చేసింది. ఏమాత్రం అవకాశం చిక్కినా రూలింగ్ పార్టీ లీడర్లపై నక్సల్స్ తుపాకీ పేల్చేవారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణా కళాసమితి నాయకురాలు బెల్లి లలిత అత్యంత పాశవిక హత్యకు గురయ్యారు. మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గానికే చెందిన బెల్లి లలితను 1999లో గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేసి, ఆమె శరీర భాగాలను 17 ముక్కలుగా నరికి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ముదు విసిరేశారు. అయితే ఈ ఘాతుకానికి నయీం ముఠా పాల్పడినట్లు తేలినప్పటికీ, ఆమె హత్య వెనుక మాధవరెడ్డి ప్రోద్బలం ఉందనే ఆరోపణలను సైతం నక్సల్స్ చేశారు. దీంతో మాధవరెడ్డిని నక్సల్స్ టార్గెట్ చేశారనే వార్తలు వచ్చాయి.

ఈ పరిణామాల్లోనే 2000 సంవత్సరం మార్చి 7వ తేదీన తన నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట ప్రాంతంలో అధికార కార్యక్రమాల్లో మంత్రి మాధవరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాలన్నీ ముగిసేసరికి పొద్దుపోయింది కూడా. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంత్రి మాధవరెడ్డి కాన్వాయ్ యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెడుతోంది. చీకటి పడడం, నక్సల్స్ టార్గెట్ లో ఉండడంతో మంత్రి భద్రతపై పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగానే ఉంది. మంత్రి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న టయోటా క్వాలిస్ వాహనంతో కూడా కాన్వాయ్ ఘట్ కేసర్ వద్ద వంతెనపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం. ఏం జరిగిందోనని మంత్రి సెక్యూరిటీ తెలుసుకునేలోపే ఎలిమినేటి మాధవరెడ్డి నిర్జీవంగా కనిపించారు. నక్సల్స్ పేల్చిన మందుపాతర ధాటికి ఆయన ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలై మంత్రి మాధవరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన సమయంలో మాధవరెడ్డి పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా ఉండడం గమనార్హం.

అయితే ఈ ఘటన జరిగిన తీరుపై ఉమ్మడి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్పట్లో నివ్వెరపోయిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న అనేక మందుపాతర ఘటనలపై పోలీస్ యంత్రాంగం ఓ అధ్యయనం చేసి, అవగాహన ఏర్పరచుకుందనే చెప్పాలి. కానీ ఘట్ కేసర్ ఘటనలో మాధవరెడ్డిని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ పేల్చిన మంతుపాతరలో అనుసరించిన విధానమేంటనేది మాత్రం వారికి అంతుబట్ట లేదు. ఎందుకంటే మందుపాతరలు అప్పటి వరకు రాత్రివేళల్లో ఎప్పుడూ పేలిన సందర్భాలులేవు. పగటిపూట మందుపాతరలు పేల్చడం వేరు. వాహనం ఎక్కడి నుంచి వస్తోంది? ఎంత దూరంలో ఉంది? మందుపాతర అమర్చే ప్రాంతానికి వచ్చేసరికి ఇంకా ఎన్ని నిమిషాలు, సెకన్లు పట్టొచ్చు? ఆ వాహనం ఎంత వేగంలో పరుగెడుతోంది? వంటి అనేక అంశాలపై పగటివేళల్లో కాస్త అటూ, ఇటూగా అంచనా వేస్తుంటారనేది పోలీసుల లెక్క.
కానీ రాత్రి వేళ, అందునా అర్థరాత్రికి చేరువలో.. 11 గంటల ప్రాంతంలో వస్తున్న వాహనాల శ్రేణి వేగాన్ని లెక్కగట్టడం, అంచనా వేయడం అత్యంత కష్టతరమని చెబుతుంటారు. వాహనం వేగాన్ని ఖచ్చితంగా పసిగడితే తప్ప ఎంచుకున్న టార్గెట్ పూర్తి చేసే అవకాశం లేదనేది పోలీస్ విభాగంలోని బీడీఎస్ (బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్) వర్గాలు చెప్పే నిర్వచనం. కానీ రాత్రివేళ చిమ్మ చీకట్లో, హెడ్ లైట్ల వెలుతురులో మాత్రమే వస్తున్న వాహన శ్రేణి వేగాన్ని అంచనా వేయడం, అందునా కాన్వాయ్ లో ‘టార్గెట్’ ప్రయాణిస్తున్న కారును పసిగట్టడం అంత సులభం కాదని అప్పట్లో పోలీసు వర్గాలు చర్చించుకున్నాయి. తిరుగు ప్రయాణపు కాన్వాయ్ లో మంత్రి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును భద్రతతో భాగంగా కాన్వాయ్ లో ముందూ, వెనుకగా తరచుగా మార్చినప్పటికీ నక్సల్స్ ‘టార్గెట్’ను రీచ్ కావడం పోలీసులను విస్మయపరిచిందనే చెప్పాలి.

ఈ ఘటనలో అసలు పాయింట్ ఏమిటంటే.. రాత్రి వేళల్లో ‘టార్గెట్’ ఖచ్చితత్వంగా శ్రీంక ప్రభుత్వానికి సవాల్ విసిరిన LTTE సంస్థ కూడా మందుపాతరలు పేల్చిన ఉదంతాలు లేవని అప్పట్లో పోలీసులు చర్చించుకున్నారు. వాహనానికి గల హెడ్ లైట్ల ఫోకస్ ను అంచనా వేసి ‘టార్గెట్’గా ఎంచుకున్న వ్యక్తి ప్రయాణిస్తున్న కారును రాత్రి వేళ మందుపాతరతో పేల్చిన ఘటన ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ గా ఇప్పటికీ పోలీసు వర్గాలు చర్చించుకుంటుంటాయి. అయితే ఈ సంఘటనలో ఆశన్న నాయకత్వంలోని నక్సల్స్ ఎలా సఫలీకృతమయ్యారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది. సమాచార సేకరణకు అప్పట్లో మొబైల్ ఫోన్లు కూడా లేకపోవడం గమనార్హం. అందుకే ఈ ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న LTTE సంస్థ కూడా నివ్వెరపోయి, ఉలిక్కిపడిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి.
ఆశన్న నాయకత్వంలో మరో రెండు ముఖ్య ఘటనలు కూడా జరిగినట్లు ప్రచారం ఉంది. అందులో హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్ ఉమేష్ చంద్ర హత్య, తిరుపతిలో సీఎం చంద్రబాబు టార్గెట్ గా అలిపిరి ఘటన. ఐపీఎస్ ఉమేష్ చంద్ర హత్యోదంతంలో అసలు టార్గెట్ మరో ఐపీఎస్ అధికారిగా ఎస్ఆర్ నగర్ సంఘటన తర్వాత వెల్లడైంది. అందుకు సంబంధించిన ఆసక్తికర అంశం మరో కథనంలో..
✍ ఎడమ సమ్మిరెడ్డి

