హోలీ పండుగ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ వేడులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా, వాహనాలపై గుంపులు గుంపులుగా తిరుగుతూ పరిచయం లేని వ్యక్తులపై రంగులు చల్లినా, వాహనలపై వెళ్లేవారిపైన వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లి, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలలో భాగంగా మార్చి 14న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అదేవిధంగా హోలీ రోజున ప్రధాన కూడళ్ళతో పాటు సాగర్ కెనాల్, మున్నేరు నది, రిజర్వాయర్ల వద్ద పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
మద్యం దుకాణాలు, బార్లు బంద్:
హోలీ పండుగ సందర్భంగా ఈనెల 14న శుక్రవారం మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తన ప్రకటనలో హెచ్చరించారు.