Top 5 This Week

Related Posts

జపాన్ లో సీఎం ఏం చేస్తున్నారంటే..!

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రఖ్యాత టోక్యో మెట్రో (Tokyo Metro)ను సందర్శించింది. తొమ్మిది లైన్లతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న టోక్యో మెట్రో అత్యాధునిక కార్యాచరణ సామర్థ్యం, అధునాతన సాంకేతికతల వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) రెండవ దశ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే క్రమంలో, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని బృందం టోక్యో మెట్రోను సందర్శించింది.

అంతేగాక రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఆర్థిక సహాయ సంస్థ జైకా (JICA) (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ – Japan International Cooperation Agency)తో చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం టోక్యోలోని జైకా ప్రధాన కార్యాలయంలో జైకా యాజమాన్యంతో సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ షోహెయ్ హరా గారు, జైకా సీనియర్ మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండవ దశ, మూసీ నది పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని జైకాను కోరింది. హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు రెండవ దశ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తుది పరిశీలనలో ఉన్నాయని ముఖ్యమంత్రి జైకా బృందానికి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం వ్యయంలో 48 శాతం, అంటే రూ. 11,693 కోట్లను రుణంగా అందించి సహకరించాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని హామీ ఇచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు మూసీ నది పునరుజ్జీవనం, కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు సమకూర్చాలని సీఎం జైకా యాజమాన్యాన్ని కోరారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాల స్థాయికి అభివృద్ధి చేయాలనే తన దీర్ఘకాలిక లక్ష్యాన్ని వారితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా మాట్లాడుతూ, తెలంగాణతో జైకాకు సుదీర్ఘమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. మెట్రో రైలు విస్తరణతో పాటు ఇతర అర్హమైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని సూచించారు.

సీఎం బృందం టోక్యో నగరంలో ప్రఖ్యాత మల్టీనేషన్ వ్యాపార దిగ్గజం సోనీ కార్పోరేషన్ (Sony Group Corporation) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించింది. ఈ సందర్భంగా సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ (Crunchyroll) బృందాన్ని కలిసింది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రదర్శించిన కంపెనీ ప్రతినిధులు, ఆయా ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ , గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ తమ విజన్‌ను వారితో పంచుకున్నారు.

Popular Articles