తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించిన భూపాలపల్లి ఘటనలో రాజలింగమూర్తి హత్యకు గల కారణాలేమిటి? ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను నివేదించాలని సీఎంవో ఇంటలిజెన్స్ వర్గాలను కోరడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు ఒకింత రాజకీయ వేడిని రగిల్చాయనే చెప్పాలి. మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హత్యపై స్పందించగా, బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజలింగమూర్తి హత్యతో తనకెటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని రాజలింగమూర్తి కోర్టులో కేసు దాఖలు చేసిన నేపథ్యంలో హత్యోదంతం భిన్న కోణాల్లో చర్చకు ఆస్కారం కలిగించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తన భర్త హత్యకు గల కారణాలపై రాజలింగమూర్తి భార్య, మాజీ కౌన్సిలర్ సరళ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఏం చెప్పారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని సారాంశం ప్రకారం.. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా రాజలింగమూర్తి కుటుంబానికి భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో రాజలింగమూర్తికి గొడవ జరుగుతోంది. దౌర్జన్యంగా తమ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తుండగా, రాజలింగమూర్తి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో తీర్పు రానున్న నేపథ్యంలో భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్ధేశంతో తన భర్త రాజలింగమూర్తిని చంపితేనే భూమిని దక్కించుకోగలమని భావించిన వారు బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పట్టణంలోని టీబీజీకేఎస్ ఆఫీసు దగ్గరలో రాజలింగమూర్తి వెడుతుండగా, రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శామంత్ @ బబ్లూ, మోరె కుమార్, కొత్తూరి కుమార్ అనే నలుగురు వ్యక్తులు రెండు బండ్ల మీద వచ్చి ఇనుపరాడ్లతో తలమీద కొట్టి, కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా తన భర్త రాజలింగమూర్తిని చంపారని సరళ పేర్కొన్నారు. ఈ సంఘటనను చూసిన తమకు తెలిసినవాళ్లు చెప్పగానే భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేసరికి అప్పటికే తన భర్త చనిపోయి ఉన్నాడని సరళ తన ఫిర్యాదులో వివరించారు. కావున వారందరిపై చటటపరమైన చర్యలు తీసుకుని, ఈ హత్య వెెనుక ఉండి ప్రోత్సహించిన వారందరినీ గుర్తించి, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉన్నదేమో అనే అనుమానం కూడా ఉందని, హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని సరళ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కోరారు.

తమకు అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు క్రైం నెం. 117/2025 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 191(20; 191(3), 61(2),103(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తును ప్రారంభించారు. కాగా రాజలింగమూర్తి హత్య కేసులో తాము ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని డీఎస్పీ సంపత్ రావు వెల్లడించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హంతకులకు రాజలింగమూర్తితో భూ తగాదాలున్నట్లు పేర్కొంటూ, ఇతర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మీడియాకు చెప్పారు. హత్య వెనుక ఎవరున్నప్పటికీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.