Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: సీఎం రేవంత్

యావత్ తెలంగాణా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుందని, ఆ సమయానికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే తమ సంకల్పమని, ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’గా అభివర్ణించారు.

తెలంగాణా రాష్ట్రాన్ని 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్–2047 ఉంటుందన్నారు. ఇది కేవలం ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని, ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ గా చెప్పారు. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోందన్నారు.

అదేవిధంగా వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ, ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుందన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో క్లియర్ గా చెప్పబోతున్నామని, దేశ ప్రగతిలో 2047 నాటికి తెలంగాణది కీలక పాత్రగా చేయడమే తమ సంకల్పంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

స్వాతంత్య్ర వేడుకల్లో పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న సీఎం రేవంత్

అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రగతిలో శాంతి భద్రతలు కీలక పాత్ర పోషిస్తాయని, దేశంలోనే ది బెస్ట్ అని తెలంగాణ పోలీసులకు పేరుందని కొనియాడారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 ప్రకారం కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలవడం మనకు గర్వకారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమ్మిట్’ (డబ్ల్యూపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకాణంగా చెప్పారు. డ్రగ్స్ పై పోరు కోసం ఈగల్ (Elite Action Group for Drug Law Enforcement) గొప్పగా పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

Popular Articles