Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఇవ్వకుంటే మీ ఇష్టం.. సమ్మక్క తల్లి అన్నీ గమనిస్తుంది: సీఎం

మేడారం మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ఆదివాసీ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఆదివాసీ కుంభమేళాను జాతీయ పండుగగా గుర్తించడానికి, రూపాయి నిధులు ఇవ్వడానికి కేంద్రానికి ఎందుకో మనసు రావడం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ప్రస్తుత హోదా వచ్చిందని, నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారని అన్నారు. ఇప్పటికైనా మేడారం జాతరను జాతీయ పండుగా గుర్తించాలని, నిధులు కేటాయించాలని, ఇవ్వకుంటే మీ ఇష్టమని, తానేమీ అననని, సమ్మక్క-సారలమ్మలు అన్నీ గమనిస్తారని సీఎం అన్నారు. మంగళవారం మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.

మేడారం అభివృద్ధి కేవలం ఒక బాధ్యత కాదని, ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగమని సీఎం అన్నారు. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే తాను పాదయాత్ర మొదలుపెట్టానని, ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డపై నుంచి తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు అడుగులు వేశామన్నారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని, ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇందులో భాగంగానే ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, నాకు ఈ జన్మ ధన్యమైనట్లేనని, ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని, రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయని, అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామని సీఎం చెప్పారు.

మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని, పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నార. స్థానికుల భాగస్వామ్యం, సహకారం ఉంటేనే ఇది జరుగుతుందని, సమ్మక్క సారక్క మాలధారణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పనుల పురోగతిపై జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ మేడారంలో పర్యటించాలని సీఎం సూచించారు. మహాజాతరకు మళ్లీ వస్తానని, ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Popular Articles