Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మీ వాహనం ఎప్పుడు తయారైంది? అయితే మీరిది తప్పక తెలుసుకోవలసిందే!

మీరు వాడుతున్న వాహనం ఏ సంవత్సరంలో తయారైంది? టూ వీలరైనా సరే, త్రీ వీలర్ అయినా ఫరవాలేదు, కార్లు, కమర్షిల్ వెహికిల్స్.. ఏదైనా సరే.., అది 2019 ఏప్రిల 1వ తేదీకి ముందు తయారైన మోడల్ వెహికిల్ అయితే మాత్రం దానికి ఖచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్రేషన్ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయాల్సిందే. లేనిపక్షంలో మీకు తిప్పలు తప్పవు. ఇందుకు సంబంధించి రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత నెంబర్ ప్లేట్ స్థానంలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ను మార్చుకునేందుకు వచ్చే సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్దేశించింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఏర్పాటుకు సంబంధించి ధరలను కూడా వెల్లడించింది. కనిష్ట, గరిష్ట ధరల ప్రకారం.. టూ వీలర్ కు రూ. 320-380, ఇంపోర్టెడ్ టూ వీలర్ కు 400-500, కార్లకు 590-700, ఇంపోర్టెడ్ కార్లకు 700-860, త్రీ వీలర్ వాహనాలకు 350-450, వాణిజ్య వాహనాలకు 600-800 రూపాయల మొత్తాన్ని రుసుముగా నిర్ణయించారు.

తమ పాత వెహికిల్ కు ఇటువంటి నెంబర్ ప్లేట్ బిగింపజేసుకోవలసిన బాధ్యత యజమానిదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుంటే వెహికిల్ ను అమ్మాలన్నా, కొనాలన్నా ట్రాన్స్ పోర్టు ఆఫీసులో ఆర్ సీ మారదు. అంతేకాదు వెహికిల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లకు కూడా అనుమతించరు. సెప్టెంబర్ 30లోపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయని వాహనాలపై కేసులు కూడా నమోదు చేస్తారు.

వాహనాలకు నకిలీ నెంబర్ ప్లేట్లను నిరోధించడం, దోపిడీలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు భద్రత తదితర అంశాలే లక్ష్యంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. వాహనాల ఓనర్లు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం www.siam.in అనే వెబ్ సైట్ లో లాగినై తమ వెహికిల్ వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది. ఈ అంశంలో వాహన తయారీ కంపెనీలకు సైతం రవాణా శాఖ కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

Popular Articles