భారీ వర్ష బీభత్సానికి వరంగల్ మహానగరం వణికిపోయింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్, హన్మకొండ, కాజీపేటలు సహా నగరం మొత్తం అతలాకుతలమైంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నగరంలోని ఎస్సార్ నగర్, సాకరాశి కుంట, హంటర్ రోడ్డు, కరీమాబాద్, ఎల్బీనగర్ తో పాటు శివనగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హన్మకొండ బస్ స్టేషన్, చౌరాస్త, రెడ్డిపురం, గోకుల్ నగర్, న్యూ శాయంపేట, బట్టలబజార్, ఓల్డ్ బీట్ బజార్, రామన్నపేట, కరీమాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు వరద తాకిడితో ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ లోనూ వర్షపు నీరు చేరింది. ఉర్సు గుట్ట ప్రాంతంలో భారీగా నీరు నిలవడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది వరదల్లో చిక్కకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు డీఆర్ ఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. వీరికి తోడు ఎన్ డి ఆర్ ఎఫ్ టీం సిబ్బంది కూడా వరంగల్ లోని లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
