Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

విద్యుత్ శాఖకు భారీ నష్టం

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లంది. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి.

భారీ వల్ల పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని, వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్పూర్తి కొనసాగించాలని ముఖ్యమంత్రి సీఎండీని ఆదేశించారు. అయితే ఇంకా వానలు, వరదల ఉధృతి తగ్గలేదని, జలమయమయిన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదని సీఎండీ అన్నారు. హైదరాబాద్ తో పాటు చాలా పట్టణాల్లో అపార్టుమెంట్లు నీటితో నిండి ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం అనివార్యమైందని, కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగిందని, పరిస్థితిని బట్టి మళ్లీ సరఫరా చేస్తున్నామన్నారు. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేయడం జరుగుతున్నదని ప్రభాకర్ రావు వివరించారు.

Popular Articles