హన్మకొండ: జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కారు. రూ. 60 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ అదనపు కలెక్టర్ ఏసీబీకి దొరికిపోయారు. హన్మకొండ జల్లా ఇంఛార్జి డీఈవోగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటరెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ అనుమతులకు సంబంధించి లంచం డిమాండ్ చేసి, సిబ్బంది ద్వారా స్వీకరిస్తూ ఏసీబీ వలలో పడ్డారు.

పాఠశాల అనుమతులకు సంబంధించి అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మొత్తం రూ.లక్ష డిమాండ్ చేశాడని, చివరికి రూ. 60 వేల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు చెప్పారు. ఈ లంచం మొత్తాన్ని స్వీకరించేందుకు డీఈవో ఆఫీసుకు చెందిన సిబ్బంది గౌస్, మనోజ్ లు మధ్యవర్తిత్వం నెరపారన్నారు. లంచం మొత్తం అంశంలో ఫిర్యాదుదారుడు అదనపు కలెక్టర్ ను రెండుసార్లు కలిసినా ఫైలు కదలలేదన్నారు. ఈ కేసులో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిని, డీఈవో కార్యాలయ సిబ్బంది గౌస్, మనోజ్ లను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ప్రకటించారు.

