Top 5 This Week

Related Posts

‘ఆటగాడి’ కోటాలో ‘వేటగాడి’ తుపాకీ! సత్తుపల్లి ‘సల్మాన్ ఖాన్’ స్టోరీలో భలే ట్విస్ట్!!

(‘సమీక్ష’ మార్క్ ప్రత్యేక కథనం)
వేటగాడికి తుపాకీ లైసెన్స్.. ఒక్క తుపాకీ కాదు.. అతని వద్ద రెండు తుపాకులు ఉన్నాయట. ఒకటి డీబీబీఎల్ (డబుల్ బ్యారెల్ బ్రీచ్) గన్ కాగా, మరొకటి ఎస్బీబీఎల్ (సింగిల్ బ్యారెల్ బ్రీచ్) గన్ ఉన్నాయట. అతను జింకల పార్కులో దుప్పులను వేటాడినట్లు అభియోగాలు ఎదుర్కుని అరెస్టయ్యాడు. అతని పేరు మెచ్చా రఘు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు సోదరుని కుమారుడు. మెచ్చా రఘుకు తుపాకీకి లైసెన్స్ ఇచ్చేనాటికి బహుషా అతనో వేటగాడనే విషయం పోలీసులకు తెలిసి ఉండకపోవచ్చని మనం నమ్మాలి. ఎందుకంటే పోలీసులు అంత ఈజీగా ఎవరికీ తుపాకీ లైసెన్స్ ఇవ్వరు మరి. దానికి చాలా తతంగం అనబడే సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది.

తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గుణగణాలపై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల సమాచార సేకరణ ఉంటుంది. అతను తుపాకీ లైసెన్స్ ను ఎందుకు కోరుకుంటున్నాడనే అంశంపై లోతైన విచారణ ద్వారా సమగ్ర సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బంది, అధికారుల ద్వారా నివేదికను తెప్పించుకుంటారు. తుపాకీ లైసెన్స్ ను మంజూరు చేసే అధికారం సంబంధిత జిల్లా ఎస్పీది. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి తుపాకీ అవసరమా? కాదా? అనే విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత సబ్ డివిజనల్ పోలీసు అధికారిది.. అంటే డీఎస్పీ స్థాయి అధికారిదన్నమాట.

‘నాకు తుపాకీ లైసెన్స్ కావాలి’ అంటూ దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఆయుధం అవసరమేంటన్నది లైసెన్స్ మంజూరీలో ప్రధాన అంశం. అతనికి ప్రాణహాని ఉండి ఉండాలి. ఎవరేని శత్రువులకు టార్గెట్ గా మారి ఉండాలి. ఏ నక్సలైట్ల నుంచో ముప్పు పొంచి ఉండాలి. లేదంటే ఏదేని ఘర్షణల్లోనో, దాడుల్లోనో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఉండాలి. సమాజానికి అవసరమని భావించిన ఇటువంటి వ్యక్తుల ప్రాణాలు పోతే చాలా నష్టమని పోలీసు శాఖ అంచనా వేసి ఉండాలి. అటువంటి వారి ప్రాణరక్షణ కోసం లైసెన్సయినా ఇవ్వాలి, లేదంటే గన్ మెన్లను ఏర్పాటు చేయాలి. సంబంధిత వ్యక్తి ఇందులో ఏది కోరుకుంటున్నాడనేది కూడా ముఖ్యమే. ఇందుకు అవసరమైన సిఫారసులు జరిగిన ఘటనల, సందర్భాలు ప్రామాణికంగా ఉంటాయి.

మెచ్చా రఘు, కుంజా భరత్ (ముసుగులు ధరించినవారు)లను అటవీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసినప్పటి చిత్రం

భద్రతాపరంగా ‘ఆత్మరక్షణ’ కోసం మాత్రమే ఆ వ్యక్తికి తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తారు. పోలీసు శాఖ నుంచి తుపాకీ లైసెన్స్ పొందిన వ్యక్తి తనకు వాడడం తెలిసిన తుపాకీని కొనుగోలు చేసుకోవచ్చు. వాటిల్లో 8MM రివాల్వర్ నుంచి 9MM పిస్టల్ వరకు, డీబీబీఎల్, ఎస్బీబీఎల్ వంటి ఏ తుపాకీనైనా కొనుక్కోవచ్చు. కానీ లైసెన్సుడ్ తుపాకీని బహిరంగంగా ఎక్కడా ప్రదర్శించరాదు. తుపాకీ లైసెన్స్ కూ నియమ, నిబంధనలు అనేకం ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. ఇదీ తుపాకీ లైసెన్స్ కు సంబంధించిన క్తుప్త కథ.

అయిదు నుంచి ఆరు దుప్పుల వరకు వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న మెచ్చా రఘుకు పోలీసులు తుపాకీ లైసెన్స్ ఏ ప్రాతిపదికన ఇచ్చారనేదే ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీసింది. ఎందుకంటే అతను మావోయిస్టు పార్టీ వంటి నక్సలైట్లకు టార్గెట్ కాదు. ఇతరత్రా ఎవరితోనూ ఘర్షణలకు పాల్పడి దాడులకు గురైన వ్యక్తి అంతకన్నా కాదు. రాజకీయ కక్షలతో ప్రాణహాని ఉన్న వ్యక్తి కూడా కాదు. కానీ అతనికి తుపాకీ లైసెన్స్ మాత్రం సులభంగానే లభించినట్లు తెలుస్తోంది. మెచ్చా రఘుకు ఒక్క తుపాకీకే లైసెన్స్ ఉందా? రెండు తుపాకులకు ఉన్నాయా? అనేది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు.

కానీ పోలీసులు ఇచ్చిన ‘లైసెన్స్’ తుపాకీతో మెచ్చా రఘు ‘సల్మాన్ ఖాన్’ను మించిపోయాడదనేది ప్రధాన ఆరోపణ. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని తాటిసుబ్బన్నగూడేనికి చెందిన మెచ్చా రఘు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి, సత్తుపల్లికి వచ్చి, అక్కడ గల జింకల పార్కులో స్వైర విహారం చేశాడనేది అటవీ అధికారులు మోపిన అభియోగం. అటవీ శాఖకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సహాయంతోనే రఘుతోపాటు మరో ముగ్గురు పార్కులోకి జొరబడి దుప్పులను వేటాడారనే ఆరోపణలపైనే అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేయగా, అందులో మెచ్చా రఘు ప్రధాన నిందితునిగా అటవీ అధికారులు చెబుతున్నారు.

ఇంతకీ మెచ్చా రఘుకు పోలీసులు తుపాకీ లైసెన్స్ ఎలా ఇచ్చారో తెలుసా? మాజీ ఎమ్మెల్యే సోదరుని కుమారుడనేది ప్రధాన అర్హత మీద మాత్రం కాదు. దాదాపు ఓ వందెకరాల ఆసామీ అనే గౌరవంతోనూ కాకపోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో అతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చారట. మెచ్చా రఘు స్టేట్ లెవల్ షూటర్ అట. నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కోటాలో అతను తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నట్లు అశ్వారావుపేట సీఐ నాగరాజు ‘సమీక్ష’కు చెప్పారు. అంటే మెచ్చా రఘు పోలీసు శాఖను కూడా మోసం చేశాడన్నమాట. ‘ఆటగాడి’ కోటాలో తుపాకీ లైసెన్సును పొందిన రఘు ‘వేటగాడి’గా మారాడనేది తనపై నమోదైన కేసు పూర్వపరాలే స్పష్టం చేస్తున్నాయి.

Popular Articles