Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

వెలుగుమట్ల భూముల వివాదంలో సర్కార్ కీలక అడుగు

ఖమ్మం: నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంలో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగానే ఆక్రమిత భూదాన్ భూముల్లో తొలగించిన ఇండ్లలోని నివాసితుల సర్వేకు అధికారులు ఉద్యుక్తమయ్యారు. ఈనెల 24వ తేదీన వెలుగుమట్ల భూదాన్ భూములు ఆక్రమణకు గురయ్యాయనే లక్ష్యంతో అక్కడ ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నవారిని ఖాళీ చేయించి, నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలసిందే. ఈ అంశం తీవ్ర వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం అక్కడ నివసిస్తున్నవారి సర్వేకు సిద్ధపడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేస్తూ, వెలుగుమట్ల గ్రామ భూదాన్ భూముల ఆక్రమణలో తొలగించబడిన ఇండ్లకు సంబంధించి, వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వేను వెంటనే చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నిర్వహణకు జిల్లాలోని 14 మంది తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ సర్వే అత్యంత త్వరితగతిన పూర్తిచేసేందుకు తహశీల్దార్లను నిర్దేశించినట్లు చెప్పారు.

సామాజిక, ఆర్థిక సర్వే పూర్తయిన తర్వాత అర్హులైన వారికి ప్రభుత్వాదేశానుసారం నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు చర్యలు చేపడతామన్నారు. వెలుగుమట్లలో తొలగింపబడిన ఇండ్లకు సంబంధించిన వ్యక్తులు తమ తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలని కలెక్టర్ అనుదీప్ తన ప్రకటనలో కోరారు.

Popular Articles