ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ. 20.19 కోట్ల రూపాయిలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇండ్లలో బేస్ మెంట్ పూర్తి చేసుకున్న 2019 మందికి లక్ష రూపాయిల చొప్పున రూ. 20.19 కోట్ల రూపాయిలను విడుదల చేశామని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని , గ్రౌండింగ్ అయిన ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తున్నామని ఇప్పటికి 13,500 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 మంది లబ్దిదారులకు మంగళవారం నాడు లాంఛనంగా లక్ష రూపాయిల చొప్పున చెక్కులను అందజేశారని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడతల్లో లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాలోనే జమచేస్తామని తెలిపారు.

నిర్మాణం పూర్తైన వెంటనే.. బేస్ మెంట్ పూర్తైన తర్వాత లక్ష రూపాయిలు, గోడలు పూర్తయిన తర్వాత 1.25 లక్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న తర్వాత 1.75 లక్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన తర్వాత మిగిలిన లక్ష రూపాయిల చొప్పున విడుదల చేస్తామని వివరించారు. బేస్‌మెంట్ గాని, గోడలు గాని, శ్లాబ్‌గాని నిర్మాణం పూర్తిచేసుకుంటే అధికారుల కోసం ఎదురుచూడకుండా లబ్దిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసినా కూడా డబ్బులు లబ్దిదారుల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు.
అయితే కనీసం 400 ఎస్ ఎఫ్ టి కి తగ్గకుండా 600 ఎస్ ఎఫ్‌టీకి మించకుండా లబ్దిదారులు ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయడం, అధికారులకు , ప్రజాప్రతినిధులకు సమన్వయం ఉండేలా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.