Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘లవ్ లెటర్’ ఇచ్చి దండం పెట్టా: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణా నూతన అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో రాజాసింగ్ బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయడానికి వచ్చినట్లు చెప్పారు. సమయం చూసుకుని వచ్చి దరఖాస్తు కూడా తీసుకున్నానని, నామినేషన్ వేయడానికి 10 మంది మద్దతు ఉండాలని చెప్పారు. కానీ తనకు మద్దతు ఇస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తన అనుచరులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరో ఇప్పటికే డిసైడ్ అయ్యారని, బీజేపీ అధికారంలోకి రాకూడదనే పెద్ద నేతలు కోరుకుంటున్నారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక తాను బీజేపీలో కొనసాగలేనని, బీజేపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం సరికాదన్నారు. అందువల్ల తాను బీజేపీ ఎమ్మెల్యే కాదని స్పీకర్‌కు మీరే లేఖ పంపండని పార్టీ నేతలను కోరారు. లక్షల మంది కార్యకర్తల మనోవేదనకు తన రాజీనామా ఒక ఉదాహరణగా చెప్పారు. కొందరు పెద్ద నేతలు జాతీయ నాయకత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల త్యాగాలకు గుర్తింపు లేకుండా పోయిందని, పార్టీకి భవిష్యత్‌లో తీరని నష్టం జరగనుందని చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కిషన్‌రెడ్డికి లేఖ ఇచ్చానని, మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పి ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నానని చెబుతూ.. జై శ్రీరామ్ అని రాజాసింగ్ నినదించారు.

Popular Articles