రోమాలు నిక్కబొడుచుకోవడం (goose bumps) అప్పుడప్పుడూ అందరికీ కలిగే అనుభవమే.
ఇలా ఎందుకు జరుగుతుంది?
భయం, విపరీతమైన ఆశ్చర్యానికి గురవడం, ఆకస్మిక ఉత్తేజం కలిగినప్పుడు, చలి లోకి వెళ్లినపుడు మనకు తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇదొక అసంకల్పిత చర్య. మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. పై కారణాల వల్ల మెదడులో అడ్రినాలిన్ (adrenaline) అనే హార్మోన్ విడుదల అవుతుంది. దాని ప్రతి చర్యగా శరీరంపైన, ముఖ్యంగా కాళ్లు చేతుల పైన రోమాలు నిటారుగా నిలడతాయి. వెంట్రుకల మొదళ్లు బయటికి ఉబ్బుతాయి. బాతుల ఈకలు పీకినపుడు వాటి చర్మంపైన చిన్న చిన్న బొడిపెలు కనిపిస్తాయి కదా. దాని పేరుమీదుగానే గూస్ బంప్స్ అనే పేరు వచ్చింది.

1) ఇక్కడ కనిపిస్తున్న ఒకటో చిత్రంలో చర్మం పైనుంచి బయటకు కనిపిస్తున్న రోమం, లోపల దాని కుదురు ( hair follicle) కనిపిస్తోంది కదా. దాని పక్కన ఎర్రగా కనిపిస్తున్నది అరెక్టర్ పైలి కండరం(arrector pili muscle).
2) చలి లేదా ఆకస్మిక ఉత్తేజం, భయానికి గురయినప్పుడు అరెక్టర్ పైలి కండరం సంకోచిస్తుంది. (రెండో చిత్రం) అప్పుడు రోమం నిటారుగా నిక్కడొడుచుకుంటుంది.
చలి నుంచి వెచ్చని ప్రదేశం లోకి వెళ్లడం, భయం, ఆశ్చర్యాలు తొలగిపోయిన తర్వాత మళ్లీ ఎప్పటిలాగే రోమాలు ఏటవాలుగా ఒరుగుతాయి.
ఇది అత్యంత సహజ చర్య. ఆందోళన చెందాల్సినదేమీ లేదు.

✍️ బి.టి. గోవిందరెడ్డి
(సీనియర్ జర్నలిస్ట్)

