Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

సారు.. సింపుల్ గా రూ. 40 లక్షలు లంచం అడిగాడు

హైదరాబాద్: ఓ ప్రభుత్వ అధికారి అత్యంత సులభంగా రూ. 40.00 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశాడు. రూ. 1.40 కోట్ల బిల్లు మంజూరు చేసేందుకు రూ. 40.00 లక్షలు అమ్యామ్యాగా అడగడంతో భరించలేని బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఇంకేముందు లంచం డిమాండ్ చేసిన సారు బుధవారం ఏసీబీ విసిరిన వలలో చిక్కాడు. జీహెచ్ఎంసీలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.

ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ కూకట్ పల్లి జోన్ లో సూపరింటెండెంట్ గా పనిచేసే పి. చిన్నారెడ్డి టేబుల్ వద్దకు ఓ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన బిల్లు వచ్చింది. చెరువులు శుభ్రపరిచే ఈ కాంట్రాక్టర్ కు రూ. 1.40 కోట్ల బిల్లు మొత్తం చెల్లించాల్సి ఉంది. అయితే అందులో రూ. 40.00 లక్షలు లంచంగా ఇస్తే తప్ప బిల్లుపై సంతకం చేసేది లేదని ఎస్ఈ చిన్నారెడ్డి డిమాండ్ చేశాడు. తాను చేసిన పనికి చెల్లించాల్సిన బిల్లులో అంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన చిన్నారెడ్డిపై బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఈ పరిణామాల్లోనే తన నుంచి లంచం డిమాండ్ చేసిన ఎస్ఈ చిన్నారెడ్డితో బాధిత కాంట్రాక్టర్ బేరసారాలకు దిగాడు. ఎట్టకేలకు రూ. 30.00 లక్షలకు బేరం కుదిరింది. ఇందులో రూ. 15.00 లక్షల మొత్తాన్ని చిన్నారెడ్డి తనవద్ద పనిచేసే ప్రవీణ్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా జోనల్ ఆఫీసులోనే కాంట్రాక్టర్ నుంచి స్వీకరిస్తుండగా, అప్పటికే వలవేసిన ఏసీబీ అధికారులు ప్రవీణ్ తోపాటు ఎస్ఈ చిన్నారెడ్డిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టారు. చిన్నారెడ్డి విధులు నిర్వహించే కార్యాలయం గదిలో కీలక ఫైళ్లను, పత్రాలను, కంప్యూటర్లను పరిశీలించి సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారెడ్డిపైనేగాక, కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరించారు.

Popular Articles