Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

GHMC ఎన్నికలు… విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలను ఉటంకిస్తూ విజయశాంతి ఫేస్ బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విజయశాంతి తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన ఆయా పోస్టును యథాతథంగా దిగువన చదవవచ్చు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోంది. చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా… విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది. ఏది ఏమైనా జిహెచ్ఎంసి మేయరు పదవి ఈ పర్యాయం “మేసేవారికి” కాక “మేయరు…” అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం.

విజయశాంతి

Popular Articles