ఛత్తీస్ గఢ్: మావోయిస్టుల లొంగుబాట్ల వరుస పర్వంలో మూడో దృశ్యం సాక్షాత్కరించబోతోంది. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న టీంల బాటలో ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో ఉదాంతి ఏరియా కమిటీ పయనించనుంది. ఈమేరకు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు, లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉదాంతి ఏరియా కమిటీ సునీల్ పేరుతో హిందీ ప్రకటన ఒకటి వెలువడింది. అంతేకాదు ఈనెల 20వ తేదీన లొంగిపోవడానికి ఉదాంతి కమిటీ సిద్ధంగా ఉన్నట్లు సునీల్ వెల్లడించారు.
తాము కాల్పుల విరమణ ప్రకటించాలని నిర్ణయించుకున్నామని, ఇతర మావోలకు ఈ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని, సాయుధ పోరాటాన్ని ముగించడం గురించి వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవని, ముందుగా మనల్ని మనం రక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సునీల్ చెప్పారు. దళాల నుండి ఒత్తిడి గణనీయంగా పెరిగిందని, తాము విప్లవాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయామని, చాలా మంది ముఖ్యమైన సహచరులను కోల్పోయామని సునీల్ అన్నారు.

ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సెంట్రల్ కమిటీ విఫలమైందని చెబుతూ, సోను దాదా, రూపేష్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తమ కమిటీ ఆయుధాలతో లొంగిపోయేందుకు సిద్దగా ఉన్నట్లు సునీల్ ప్రకటించారు. ‘ముందుగా మనం బతకాలి, ఆపై మన పోరాటాన్ని కొనసాగించవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. గోబ్రా, సినాపాలి, ఎస్డీకే, సితానదిలోని అన్ని యూనిట్లు ఆలస్యం కాకముందే జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సునీల్ పిలుపునిచ్చారు. సహచర కామ్రేడ్లలో ఎవరైనా తనను 9329913220 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చని సునీల్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా ఉదాంతి ఏరియా కమిటీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు గరియాబంద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నిఖిల్ రాఖేఛా పేర్కొన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్ సైట్ కథనంలో ఉటంకించింది.

