Top 5 This Week

Related Posts

రూ. 6 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్: ఖమ్మం మీదుగా రాజస్థాన్ కు అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 6.00 కోట్ల విలువైన 1,210 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. తమ కమిషనరేట్ పరిధిలో ఇంత భారీ మొత్తపు గంజాయిని పట్టుకోవడం ఇదే మొదటిసారిగా రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరించారు.

రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ అనే (22) వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుంటాడు. ఇందులో భాగంగానే రాజస్థాన్ నుంచి ఐరన్ లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ వికాస్ దాన్ని భద్రాచలంలో అన్ లోడ్ చేసిన తర్వాత సిమెంట్ బస్తాలను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరిలో గంజాయిని కొనుగోలు చేసి, సిమెంట్ బస్తాల్లో పెట్టి ఖమ్మం, హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ కు రవాణా చేస్తున్నారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం నుంచి గంజాయితో వెడుతున్నలారీని పక్కా సమాచారంతో మహేశ్వరం ఎస్వోటీ పోటీసులు పట్టుకున్నట్లు సీపీ సుధీర్ బాబు వివరించారు.

లారీలో సిమెంట్ బస్తాల్లో రవాణా చేస్తున్న గంజాయిని పరిశీలిస్తున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఈ విధంగా గంజాయిని రవాణా చేసినందుకు డ్రైవర్ వికాస్ కు నిర్వాహకులు దేవీలాల్, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ అనే వ్యక్తులు ఖర్చుల కింద రూ. 5.00 లక్షలు ఇచ్చేవారని చెప్పారు. మంగళవారం లారీ (డీసీఎం వ్యాను)లో రవాణా చేస్తున్న రూ. 6.00 కోట్ల విలువైన 1,210 కిలోల గంజాయిని పట్టుకుని, నిందితుడైన వికాస్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిర్వాహకులను కూడా త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమకు తెలియజేయవచ్చని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.

Popular Articles