హైదరాబాద్ నగరంవైపు గుట్టలు గుట్టలుగా, కట్టలు కట్టలుగా గంజాయి రవాణా అవుతోంది. పది రోజుల క్రితం విజయవాడ-హైదరాబాద్ హైవేపై రూ. 5.00 కోట్ల విలువైన గంజాయి పట్టుబడిన ఘటనను మరువకముందే తాజా మరోసారి భారీగా పట్టుబడడం గమనార్హం. ఖమ్మం, సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది జాయింట్ ఆపరేషన్ లో ‘ఈగల్’ టీం రూ. 4.2 కోట్ల విలువైన 847 కిలోల గంజాయిని పట్టుకుంది. ఒడిషా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్న ఈ భారీ గంజాయి నిల్వలను బెంగళూరు హైవేపై తొండుపల్లి వద్ద ‘ఈగల్’ టీం అధికారులు పట్టుకున్నారు.
తమకు అందిన సమాచారం మేరకు ఈగల్ టీం బెంగళూరు హైవేపై గల తొండుపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, రూ. 4.2 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ ఎస్పీ రూపేష్ వెల్లడించారు. ఇదిలా ఉండగా మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఇందులో ఒకరు వినియోగదారుడు కాగా, మరొకరు డ్రగ్స్ పెడ్లర్ గా చెప్పారు. మల్నాడు డ్రగ్స్ కేసులో ఏడు పబ్బులకు నోటీసులు ఇచ్చామని, మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది అరెస్టయ్యారని తెలిపార. మల్నాడు కిచెన్ కేసులో విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయ్యాక చర్యలు ఉంటాయన్నారు.
