హైదరాబాద్: తాము ప్రభుత్వానికి లొంగిపోలేదని మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పేర్కొన్నారు. ‘లొంగుబాటు’ అంశంపై ఈ సందర్భంగా ఆయన కీలక నిర్వచనం చెప్పారు. తమది ఏ కోణంలోనూ లొంగుబాటు కాదన్నారు. తనతోపాటు మిగతా నాయకులెవరూ లొంగిపోలేదన్నారు. తాము రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి మాత్రమే వచ్చామని, ఇది లొంగుబాటు కాదని, ఇదే విషయాన్ని గత నెల 24వ తేదీన స్పష్టంగానే చెప్పామన్నారు.
కగార్ యుద్ధం తీవ్రతరమైన స్థితిలో వేర్వేరు ప్రాంతాల్లో రక్షణ పొందడానికి, ఆ తర్వాత క్రమంలో పార్టీని సమన్వయం చేసుకునేందుకు వెడుతుండగా తెలంగాణా పోలీసులు తమను అరెస్ట్ చేశారని చెప్పారు. తమను పట్టుకున్న స్థితిలో తెలంగాణా పోలీసులు తమను చంపవచ్చని, కానీ తమ విధానం చంపడం కాదని, సరెండర్ చూపిస్తామని పోలీసులు పదే పదే పేర్కొన్నారని, అయినా అందుకు తాము సిద్ధపడలేదన్నారు. ఇదే విషయాన్ని సీఎం వద్ద కూడా తాము చెప్పామన్నారు. రాజకీయ జీవితాన్ని వదిలి వ్యక్తిగత జీవితానికి పరిమితమైతే మాత్రమే అది లొంగుబాటు అని దేవ్ జీ నిర్వచించారు. ఈమేరకు దేవ్ జీ పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ లొంగుబాటు అంశంపై ఇలా స్పష్టతనిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల దైనందిన, మౌలిక సమస్యలు మిగిలే ఉన్నాయని, వాటిపై చట్టబద్ధ పోరాటం చేయడమే ప్రజా రాజకీయమన్నారు. దశాబ్ధాల తరబడి తాము నమ్మిన సిద్ధాంతం మార్క్సిజం, లెనినిజం, మావోయిజమని, తమ ఆలోచనకు ఎప్పుడైనా అది కేంద్ర బిందువని దేవ్ జీ పేర్కొన్నారు. తాము చావుకు భయపడి బహిరంగ జీవితాన్ని ఎంచుకోలేదన్నారు. తాము చావుకు భయపడేవాళ్లమే అయితే సోను, సతీష్ (మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న)ల మాదిరిగా ముందే చెప్పి, వచ్చి సరెండ్ అవుతున్నాం.. అనేవాళ్లమని దేవ్ జీ వ్యాఖ్యానించారు. అంతపెద్ద కర్రెగుట్ట ఆపరేషన్ లోనే నిత్యం చావుతో సావాసం చేశామన్నారు. చావుకు భయపడితే కర్రెగుట్ట ఆపరేషన్ లోనే వచ్చి సరెండర్ అయ్యేవాళ్లమన్నారు.
తమ అరెస్ట్ వరకు నిత్యం చావుతో సంభాషిస్తూనే, తుపాకీ తూటా నీడనే పయనిస్తున్నామని చెప్పారు. అనేక ఘర్షణల మధ్య అనివార్యంగా, అంతిమంగా అరెస్ట్ అయ్యామని చెప్పారు. తాము తుపాకీ ఆధిపత్యాన్ని కోరుకోలేదని, పార్టీని నడిపించేంది రాజకీయం మాత్రమేనని చెప్పారు. తాను పార్టీకి జనరల్ సెక్రటరీని కాదని, తమ పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాలు జరగని స్థితిలో తనను కార్యదర్శిగా పేర్కొనడం ప్రాతిపదిక కాదన్నారు. తమదీ రాజకీయ పార్టీయేనని, కాకపోతే అప్పట్లో సాయుధ పంథాగా దేవ్ జీ చెప్పారు.
