పెద్ది సుదర్శన్ రెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చాలా మందికి సుపరితమైన పేరు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు నమ్మిన బంటుగా ప్రాచుర్యం పొందిన గులాబీ పార్టీ లీడర్. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరి నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేశారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సుదర్శన్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ పయనపు ప్రస్తావన దేనికంటే..?
మూడు రోజుల క్రితం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన సంగతి తెలిసిందే కదా? ఈ సభకు హాజరైన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మీడియా సమావేశాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సహజంగానే ఆవేశంతో ఊగిపోతుంటారు. కానీ రజతోత్సవ సభ సక్సెస్ జోష్ లో పెద్ది మాట్లాడిన మాటలు అధికార వర్గాల్లోనే కాదు, రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో ఏమంటారంటే..

రజతోత్సవ సభకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదనేది సుదర్శన్ రెడ్డి ఆరోపణ. మధ్యలోనే పోలీసులు బిచాణా ఎత్తేశారని కూడా కామెంట్ చేశారు. ఇటువంటి కామెంట్లు, ఆరోపణలు, విమర్శలను అనేక మంది రాజకీయ నాయకుల నుంచి సహజంగానే వింటుంటాం. కానీ ఇక్కడ సుదర్శన్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి, అధికార పార్టీ నాయకులను ఉద్ధేశించి ‘మేం తిరగబడితే మీ బతుకేంది? మేం రియాక్టయితే మీరుంటరా? మీ హోర్డింగులు ఉంటయా? ఆర్డీవోళ్లు.. నిన్న తన్నుడే ఉండె..నాకు దొర్కలే, అధికారులకు కాంగ్రెస్ నాయకులు హుకుం జారీ చేసిండ్లు కదా, ఏం పీకిండ్లు ఇప్పుడు? సభ ఉందని, పండుగ ఉందని ఓపిక పట్టినం, సభ అయిపోయింది, ఇక చూద్దాం.. అంటూ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఎన్నో సభలు నిర్వహించామని, కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ సభలు సజావుగా సాగాయనే సారాంశంతో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.

మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో ఆర్టీవో అధికారులు దొరికితే తన్నుడే ఉండె.. అంటూ చేసిన వ్యాఖ్యలపైనే అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి ఇటువంటి సభల నిర్వహణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి నిష్ణాతునిగా పేరుంది. మహాగర్జన లాంటి అనేక సభలను నిర్వహించిన అనుభవం ఉంది. అయితే తమ గులాబీ పార్టీ పాలనలో కాంగ్రెస్ సభలు సజావుగా జరిగాయని ఆయన చెప్పడమే అసలు విశేషం. ఖమ్మం కేంద్రంగా ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2023 జూలై 2వ తేదీన కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా నిర్వహించిన రాహుల్ గాంధీ సభకు ఇదే ఆర్టీఏ అధికారులు అనేక ఆటంకాలు కల్పించిన అంశాన్ని సుదర్శన్ రెడ్డి మర్చిపోయినట్లున్నారనే వాదన కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. కోదాడ, ఏన్కూరు, జూలూరుపాడు ప్రాంతాల్లో అప్పటి సభ సందర్భంగా ఆర్టీఏ అధికారుల వ్యవహార తీరుపై ప్రజలు తిరగబడ్డారు కూడా. ఒకటి రెండు చోట్ల ఆర్టీఏ అధికారులు పరారైనట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
అధికార, విపక్షాల మధ్య ఇటువంటి సభలు, సమావేశాల సందర్భంగా పరస్పర మాటల తూటాలు సహజమే కావచ్చు. కానీ ఆర్టీఏ అధికారులే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సభ జరిగిన రోజు ఆర్టీవో వాళ్లు తనకు దొరకలేదని, దొరికితే తన్నుడే ఉండె.. అంటూ సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా పలువురు ఉటంకిస్తున్నారు.