ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో గురువారం అరెస్ట్ చేశారు. గన్నవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వైఎస్ఆర్ సీపీ లీడర్ వల్లభనేని వంశీ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.
గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్దన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై అభియోగాలు ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ఇటీవల ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టుకు హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తనను బెదిరించి తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారని పోలీసులకు సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టంలోని 140(1), 308, 351(3) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వంశీని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.