మంత్రి కొండా సురేఖ మళ్లీ చిక్కుల్లో పడినట్లేనా? వివాదాస్పద వ్యాఖ్యలు, కోర్టులో పరువునష్టం కేసుల దాఖలు వంటి పలు అంశాల్లో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్న కొండా సురేఖ తాజా పరిణామాల్లో సరికొత్త సమస్యను ఎదుర్కోవడం అనివార్యమా? తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖకు కొత్త చిక్కును తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు రాజకీయంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే..?
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఆమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ ఫిర్యాదులో అభ్యర్థించారు. ఇటీవల వరంగల్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఈ ఫిర్యాదుకు దారి తీయడం గమనార్హం.

గత ఎన్నికల్లో సురేఖ విజయం కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఓ కార్యక్రమంలో చెప్పారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, మురళి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని, సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగడం అనైతికమని, ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి హరి సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నన్నపునేని నరేందర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లీగల్ కన్వీనర్ భరత్ కుమార్, విద్యార్థి నాయకులు, మాజీ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్, కమ్యూనికేషన్ చైర్మన్ రాకేష్ అందజేశారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేశానని కొండా మురళి చెప్పడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు. ఒక అభ్యర్థి ఇంత భారీ మొత్తంలో వ్యక్తిగతంగా ఖర్చు చేయడం ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇది డబ్బుతో ఓట్లు కొనుగోలుచేయడమేనని, అప్రజాస్వామికమని నరేందర్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖపై నరేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.