Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

నర్సన్నా… ‘గుమ్మడి’తో సీఎం రేవంత్ ఆలింగనం

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో గుమ్మడి నర్సయ్యకు తనను కలిసే అవకాశం కల్పించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన పొరపాటును సవరించుకున్నట్లయింది ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య సీఎంను కలిసేందుకు ఇటీవల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం ఎదురుగా ఫుట్ పాత్ పై ఎర్రటి ఎండలో నిల్చున్న గుమ్మడి నర్సయ్య వీడియో ప్రజల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

గుమ్మడి నర్సయ్యకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు. గుమ్మడి నర్సయ్య వంటి ప్రజా నాయకున్ని కలిసే విషయంలో అలా జరిగి ఉండాల్సింది కాదని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలోనే స్పందిస్తూ గుమ్మడి నర్సయ్య వచ్చిన విషయం తనకు తెలియదని, సమాచారలోపం వల్ల అలా జరిగిందని చెప్పారు. కమ్యూనిస్టు నాయకులు ప్రజోపయోగ పనులకోసం మాత్రమే వస్తారని, వ్యక్తిగత పనులపై రారని, నర్సయ్య వంటి నాయకులను కలిసేందుకు తాను ఉత్సుకత చూపుతానని కూడా సీఎం అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తున్న గుమ్మడి నరసయ్య, చిత్రంలో మంత్రులు ఉత్తమ్, సీతక్క, వేం నరేందర్ రెడ్డి తదితరులు..

ఈ నేపథ్యంలోనే గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం అసెంబ్లీలో కలిశారు. ఇల్లెందు నియోజకవర్గ సమస్యలపై భారీ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించారు. రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇల్లెందు ప్రాంత రైతులకు సీతారామ ప్రాజెక్టు నీటిని అందించాలని, ఇల్లెందును రెవెన్యూ డివిజన్ గా మార్చాలని, కొమరారం, బోడు కేంద్రాలుగా మండలాలను ఏర్పాటు చేయాలనే తదితర అనేక ప్రజా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గుమ్మడి సీఎంకు అందించారు.

వినతి పత్రం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కనే గల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచన చేశారు. వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో, మంత్రులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇల్లెందు ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లందించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.

నర్సన్నా.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి తనను ఆప్యాయంగా పలకరించి ఆత్మీయంగా కౌగిలించుకున్నారని గుమ్మడి నర్సయ్య ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు. సీఎం పలకరింపు తీరు తనకు ఎంతోసంతోషాన్నిచ్చిందని, గతంలో జరిగిన పరిణామాలనేవీ ఆయన పట్టించుకోలేదని, అప్యాయంగా హత్తుకున్నారని చెప్పారు. తాను ఇచ్చిన వినతి పత్రంలోని సమస్యలను ప్రభుత్వం తీరుస్తుందని గుమ్మడి నర్సయ్య అశాభావాన్ని వ్యక్తం చేశారు.

Popular Articles