తనను ‘లిల్లీపుట్’గా అభివర్ణించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ఈమేరకు ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, తన ఉద్యమ ప్రస్ధానానికి సంబంధించి ‘వారి జ్ఞానానికి నా జోహార్లు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బద్ధశత్రువులైన రేవంత్ రెడ్డి, వేమూరి రాధాక్రిష్ణ వ్యాఖ్యలనే కవిత వల్లె వేశారని కూడా జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పార్టీ నాశనం కావడానికి తానే కారణమనే కవిత వ్యాఖ్యపై స్పందిస్తూ, గతంలో జిల్లాలోని 12 సీట్లను పార్టీ గెలవడానికి తాను కారణమైతే, ప్రస్తుత స్థితికి కూడా తానే కారకునిగా అభివర్ణించారు. ‘కొన్ని చోట్ల వాళ్ల సొంత సీట్లలో ఓడిపోయారు, దానికేం కారణం చెప్తారు?’ అని కూడా జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకుంటే తానే కాదు పార్టీలో ఎవరూ లేరని జగదీష్ రెడ్డి అన్నారు. మొత్తంగా కవిత, జగదీష్ రెడ్డిల పరస్పర వ్యాఖ్యలు బీఆర్ఎస్ రాజకీయాల్లో కాక రగిల్చినట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


