Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

సీతారామ ప్రాజెక్టు.. కేసీఆర్ కృషి ఫలితం: హరీష్ రావు

సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కృషి ఫలితమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. నాడు సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారని, అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు దాఖలు చేశారన్నారు. తిట్టడం తప్ప, కట్టడం రాని కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలని హరీష్ అన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా నీరు అందదని వ్యాఖ్యానించినవారు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్రా తరలించుకుపోతున్న పరిస్థితి ఏర్పడిందని, ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడమేనని అన్నారు. దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (ఫైల్ ఫొటో)

కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా 90% పనులు పూర్తి చేశారని, కేసీఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని హరీష్ రావు అన్నారు. ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసీఆరే కారణమన్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గమని, ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనబై వేల ఎకరాలకు, పరోక్షంగా పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా గోదావరి జలాలు అందుతాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి, అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మీద విషం చిమ్మారని, వృథా ప్రాజెక్టు అన్నారని, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. డిపిఆర్ లేదన్నారని హరీష్ గుర్తు చేశారు.

అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పది లక్షల ఎకరాలకు నీళ్లించే ప్రాజెక్టును ప్రారంభించారంటే, దాని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, మనం చేసిన అభివృద్దే శాశ్వతమని నమ్మే నాయకుడు కేసీఆర్ అని, అలా నమ్మి నిర్మించినవే కాళేశ్వరం, సీతరామ ఎత్తిపోతల ప్రాజెక్టులని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతాంగానికి జీవనాడులై ఆయా ప్రాజెక్టులు భాసిల్లుతాయని, కేసీఆర్ కృషిని దశదిశలా చాటుతాయని హరీష్ రావు తన ప్రకటనలో పేర్కొన్నారు.

Popular Articles